ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. అయితే, ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సెషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. దీనిపై స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇది కొత్త సెషన్ కాదనీ, అంతకుముందు జరిగిన సెషన్‌కు కొనసాగింపు కాబట్టి, గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించడం సాధ్యం కాలేదని ప్రభుత్వం పేర్కొందని.. ఈ సాంకేతిక అంశం కారణంగా గవర్నర్ ప్రసంగం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపిందన్నారు.. అయితే, ఐదు నెలల తర్వాత సభ సమావేశమవుతోంది, సాధారణ పరిస్థితుల్లో ఇంత సుదీర్ఘ విరామం తర్వాత సభ సమావేశమైనప్పుడు, కొత్త సెషన్ తో సభ జరగాలన్నారు గవర్నర్.. సుదీర్ఘ విరామం ఉన్నప్పటికీ, ప్రభుత్వం మునుపటి సెషన్‌ను కొనసాగించాలని ఎంచుకుంది, సాంకేతిక కారణాలను ఉటంకిస్తూ సంప్రదాయ గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసిందన్నారు.
సభలో గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ ప్రకటన… కానీ, గవర్నర్ సొంత ప్రసంగం కాదు అని తన ప్రకటనలో పేర్కొన్నారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్… ఇది గత సంవత్సరంలో ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు, విజయాలు, తదుపరి సంవత్సరానికి సంబంధించిన విధాన సూచికల నివేదిక పత్రం.. ఇది సభ్యులు ప్రసంగంలో పేర్కొన్న పరిపాలన విషయాల గురించి సభలో సభ్యులు అర్ధవంతమైన చర్చను నిర్వహించే అవకాశం కల్పిస్తుందన్నారు.. ఇక, గవర్నర్ ప్రసంగం… ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వం బాధ్యతను గుర్తు చేయడం, ప్రజాస్వామ్య సూత్రాలను సమర్థించడంలో ఒక ముఖ్యమైన సాధనంగా అభివర్ణించారు.. ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ సిఫార్సును కోరినప్పుడు, గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.. దురదృష్టవశాత్తు, ఇది అనుకోకుండా జరిగిందని తరవాత ప్రభుత్వం పేర్కొందని.. నోట్ అనుకోకుండా వచ్చిందనడం హాస్యాస్పదంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Russia-Ukraine War: పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలియజేశానని తెలిపారు గవర్నర్ తమిళిసై.. నా సిఫార్సును ఇవ్వడానికి నేను సమయం తీసుకునే స్వేచ్ఛ నాకు ఉందని.. అయితే, ప్రజా సంక్షేమం ఇమిడి ఉందని, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఈ బడ్జెట్ సెషన్‌లో గవర్నర్ ప్రసంగం లేక పోవడం వల్ల, ప్రభుత్వ గత ఏడాది పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారన్న ఆమె.. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు… రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని అధికారాలు ఇచ్చినప్పటికీ, గవర్నర్ ప్రసంగం నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, నా ప్రాథమిక ఉద్దేశ్యం ప్రజల సంక్షేమం అన్నారు.. అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించడానికి నా సిఫార్సును ఇచ్చానని తెలిపారు.