Governor Tamilisai Meets Ibrahimpatnam Victims In NIIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో ఇబ్రహీంపట్నం ఘటన బాధితుల్ని పరామర్శించిన గవర్నర్ తమిళిసై.. నిమ్స్‌లో ట్రీట్‌మెంట్ పట్ల బాధితులు సంతృప్తిగానే ఉన్నారని అన్నారు. అయితే.. వాళ్లు ఆర్థిక సహాయం కోరుతున్నారని, ఆ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సహాయం చేయాలని తాను సూచిస్తానని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరాృతం కాకూడదని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తానని వెల్లడించారు. ఎక్కువ ఆపరేషన్‌లు చేయాలన్న టార్గెట్‌తో ఇలాంటి పనులకు పాల్పడకూడదన్నారు. కుటుంబ నియంత్రణ అంటే, మరింత మంది ముందుకు వచ్చేలా చేయాలి గానీ.. ఇలా చేస్తే ముందుకు వచ్చే వాళ్ల ధైర్యం కూడా దెబ్బ తింటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు సజావుగా, మంచిగా జరగాలని.. ఇదే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇస్తానని గవర్నర్ తెలిపారు. నలుగురు చనిపోవడమన్నది మామూలు విషయం కాదని, ఇది ఆమోదయోగ్ం కాదని అన్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత పూర్తి కారణాలేంటో వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఎక్కువ ఆపరేషన్‌లు చేయాలన్న టార్గెట్, ఇన్ఫెక్షన్ వల్లే ఇలా జరిగి ఉంటుందని ఒక డాక్టర్‌గా తాను భావిస్తున్నానన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్తానని, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటానని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాల్సిందిగా తాను ప్రభుత్వానికి లేఖ రాస్తానని, ఆ చర్యలు వేగవంతం అయ్యేలా తాను చూసుకుంటానని గవర్నర్ తమిళిసై హామీ ఇచ్చారు.
కాగా.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రన ఆపరేషన్ చేయగా, దురదృష్టవశాత్తూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారికి వివిధ ఆసుపత్రిల్లో చికిత్స అందించారు. వారిలో కొందరు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని సమాచారం. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస్ అన్నారు. వైద్యులను ప్రత్యేకంగా విచారించిన తర్వాత, పూర్తి రిపోర్ట్‌ను సిద్ధం చేయనున్నారు.