Site icon NTV Telugu

Bonalu: నేటినుంచి ఆషాఢ బోనాలు.. గోల్కొండ జగదాంబకు తొలిబోనం

Bonalu

Bonalu

న‌గ‌రానికి ఆధ్యాత్మిక శోభ సంత‌రించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి మొదలవుతుంది. బోనాల ఉత్సవాలతో నగరంలో బస్తీలు, కాలనీలు కళకళలాడుతాయి. భక్తులు తమ ఇష్టదైవానికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. హైదరాబాద్ లో తొలి బోనం గురువారం చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి సమర్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. ఇవాల్టి నుంచి వచ్చేనెల 28వ తేదీ వరకు తొమ్మిదివారాల (గురు,ఆదివారాలు)పాటు ఆషాఢమాస బోనాలను చారిత్రక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో దేవాదాయ శాఖ ఘనంగా నిర్వహించనుంది. బోనాలు ఉత్సవాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచి (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్‌ చౌరస్తాలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈనేపథ్యంలో లంగర్‌హౌస్‌ చౌరస్తా నుంచి అమ్మవారి పట్టువస్త్రాలు.. తొట్టెల ఊరేగింపుతో జాతర ప్రారంభం అవుతుంది. బోనాల నేపథ్యంలో.. గోల్కొండ జగదాంబికకు 9 వారాల పూజల సందర్భంగా గోల్కొండ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అయితే.. ఈ ఆంక్షలు పూజలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటాయి.

కాగా.. రాందేవ్‌గూడ టు గోల్కొండ కోట వయా మక్కీదర్వాజ, లంగర్‌హౌస్‌ టు గోల్కొండ వయా ఫతేదర్వాజ, షేక్‌పేట నాలా, సెవెన్‌టూంబ్స్‌ టు గోల్కొండ కోట వయా బంజారాదర్వాజ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే.. కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి బోనాలు అంతగా జరగకపోవడంతో.. ఈసారి పూర్తిస్థాయిలో గోల్కొండ బోనాల జాతర జరుగుతుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జగదాంబిక అమ్మవారికి ఆలయ ట్రస్టు చైర్మన్‌ వావిలాల మహేశ్వర్‌ తెలిపారు.

Breaking: తెగిపడిన హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు.. 8 మంది సజీవదహనం

Exit mobile version