ప్రేమ, పెళ్లి ఎప్పుడు ఎవరితో జరుగుతాయి అనేది మన చేతిలో ఉండదు. మనసు ఎవరిని కోరుకుంటుందో వారితోనే జీవితాంతం నడవాలనుకుంటాం. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా.. ప్రస్తుత సమాజంలో పెళ్ళికి లింగ బేధం అడ్డు కావడం లేదు. ఇంకా చెప్పాలంటే స్వలింగ సంపర్కుల సంబంధం అనేది లీగల్ కూడా అయ్యింది. ఎన్నో దేశాలలో ఇద్దరు ఆడవారు, ఇద్దరు మగవారు పెళ్లి చేసుకొని తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పటివరకు మన దేశంలో చాలా చోట్ల స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకున్నారు అనే విషయాన్నివినే ఉంటాం. తాజాగా తెలంగాణలో ఇద్దరు పురుషులు వివాహంతో ఒక్కటి కానున్నారు.
హైదరాబాద్ కి చెందిన సుప్రియో, అభయ్ అనే ఇద్దరు యువకులు 2013 లో ఒక డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు దగ్గరగా ఉండడంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఎనిమిదేళ్ల పాటు సహజీవనం చేసిన వీరు ఈ డిసెంబర్ లో వివాహంతో ఒక్కటికానున్నారు. ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్ళికి ఆమోదం తెలపడంతో ఈ జంట త్వరలోనే ఒక్కటి కానుంది. ఇక ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం తెలంగాణలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అందరి పెళ్లిళ్లు లానే తమ వివాహంలోనే మంగళ స్నానాలు, నిశ్చితార్థం, సంగీత్ ఉంటాయని ప్రేమ జంట చెప్తున్నారు.