మనదేశంలో గవర్నర్ వ్యవస్థకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఎప్పటినుంచో వుంటోంది. రాజ్యాంగ బద్ధమయిన పదవిని రాజకీయాలకు వాడుకుంటున్నారని, ప్రభుత్వాలను సరిగా పనిచేయకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఏనాటినుంచో వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతోందంటున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా మళ్ళీ ఈ అంశం తెరమీదకు వచ్చిందనే చెప్పాలి. గతంలో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాకి. మహిళ అనే చిన్నచూపుతో అవమానాలకు గురిచేస్తున్నారంటూ గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేయడం యావత్ దేశమంతా హాట్ టాపిక్ అవుతోంది. తాను ముఖ్యమంత్రిని అన్నగా భావిస్తానని, కానీ ప్రభుత్వంలోని కొందరు తనను కనీసం మహిళగానైనా గౌరవించడం లేదని, గవర్నర్ వ్యవస్థకైనా గౌరవం ఇవ్వడం లేదన్నారు.
తాను పాల్గొనే కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనడం లేదన్నారు. కనీసం ప్రొటోకాల్ పాటించకుండా అవమానాలకు గురిచేశారని.. చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయడంలేదన్నారు. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తానని, తనకు రాజకీయాలు అవసరం లేదన్నారు. రాజ్ భవన్‌లో ఇటీవల తల్లి మరణిస్తే ప్రధాని సైతం తనను పరామర్శించారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం చూసేందుకు కూడా రాలేదన్నారు. కనీసం ఫోన్ చేసి కూడా పలకరించలేదని.. స్పెషల్ ఫ్లైట్ అడిగితే కూడా ఇవ్వలేదన్నారు. తన తల్లి చనిపోతే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం ఫోన్ కూడా ఎత్తలేదని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
Governor Tamilisai: నేను ఎవ్వరినీ కించపరచటం లేదు.. నన్ను అవమానించారు..
దూరప్రయాణాలలో గవర్నర్ రోడ్డు మార్గంలో ప్రయాణించడం అరుదు. అయితే, సమ్మక్క సారక్క జాతరకు కూడా ఐదు గంటలు ప్రయాణం చేసి రోడ్డు మార్గంలో వెళ్లినట్లు చెప్పారు. తెలంగాణ వ్యవహారాలపై ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారన్నారు. కరుణానిధి , జయలలిత, మమతా బెనర్జీ వంటి వారు గవర్నర్లతో విభేదించినా ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచేవారని ఆమె అన్నారు. అంతేకాకుండా యాదగిరిగుట్ట పర్యటనలోనూ గవర్నర్ కి చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ నేతలు కూడా ఉగాది వేడుకలకు పిలిస్తే వెళ్లలేదు. అదేంటని మీడియా ప్రశ్నిస్తే వెళ్ళడం, వెళ్ళకపోవడం తమ ఇష్టమన్నారు. తమిళిసై ప్రోటోకాల్ రగడ విషయంలో కేంద్రం సీరియస్ గా వుందని తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని సీఎస్ సోమేష్ కుమార్ ని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా? కేంద్రం ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.