Gangula Kamalakar Suggestions To Officials On CMR: సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పౌరసరఫరాల శాఖలోని ఉన్నతాధికారులు, జిల్లాల డీఎస్వో, డీఎంలతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సీఎంఆర్, రాబోయే వానాకాలం పంట సేకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎఫ్‌సిఐ, సీఎంఆర్ సేకరణ పునరుద్దరించిన తర్వాత జరుగుతున్న మిల్లింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తి చేసిన మంత్రి.. ఖచ్చితమైన నిభందనలు పాటిస్తూ, గడువులోగా మిల్లింగ్ కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మిల్లింగ్‌లో జాప్యానికి అధికారులదే బాధ్యత అన్న మంత్రి.. త్వరలోనే జిల్లాల్లో తానే స్వయంగా పర్యటిస్తానన్నారు. సీఎంఆర్‌లో నిర్లక్ష్యం వహిస్తే.. ఎవరినైనా ఉపేంక్షించేది లేదని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎఫ్‌సీఐ వైఖరితో పాటు, మిల్లర్లకు సంబంధించిన అంశాలపై సుధీర్ఘ కసరత్తు చేసిన మంత్రి గంగుల కమలాకర్.. జిల్లాల్లో మొన్నటి వానలకు తడిసిన ధాన్యం ఎంత ఉందనే వివరాలతో పాటు, ఈ వానాకాలం సేకరించాల్సిన ధాన్యం పరిమాణంపై వారంలోగా నివేదికలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. అవసరమైతే.. దానిపై మరోసారి సమావేశం నిర్వహిద్దామని పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉన్న నేపథ్యంలో.. వచ్చే వానాకాలం ధాన్యం నిలువ ఉంచడానికి గల ఇంటర్మీడియట్ స్టోరేజీలను గుర్తించాలన్నారు. జిల్లా యంత్రాంగం క్రమం తప్పకుండా మిల్లులను తనిఖీ చేయడంతో పాటు మిల్లింగ్ ప్రక్రియ, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే టాస్క్ ఫోర్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని సూచించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ పీడీఎస్ బియ్యం రీసేల్, రీసైక్లింగ్ జరగకుండా.. చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సంక్షేమ గురుకులాలకు, హాస్టళ్లకు, విద్యాలయాలకు సరైన నాణ్యతతో కూడిన బియ్యం మాత్రమే అందించాలన్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సక్రమంగా పనిచేసే అధికారులను ప్రశంసిస్తామని.. విదినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నవారిని మాత్రం ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.