కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఆర్ఎస్ నాయకులు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కామెంట్స్ మాట్లాడుతూ.. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందని ఆయన మండిపడ్డారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామన్నారు. తెలంగాణలో ప్రజలు భారతీయులు కాదా? తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం కాదా? మేమేమన్నా విదేశీయులమా? అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం కొనాలని అడగడం మా హక్కు. మీ మెడలు వంచైనా ధాన్యం కొనెలా ఒత్తిడి తెస్తామని, అధికార పార్టీలో ఉన్న తమను ధర్నా చేసే స్థాయికి తీసుకువచ్చింది కేంద్రమన్నారు. కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసనగా తామంతా రోడ్లపైకి వచ్చామని, ధాన్యం కొనాలని అడిగేందుకు ఢిల్లీకి వెళ్తే ఘోరంగా అవమానించారన్నారు.
ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు, ఏ రాష్ట్రంలో ఏ పంట పండినా వారి అవసరాలకు పోను మిగిలిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని రాజ్యాంగంలో చేర్చారన్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల తెలంగాణలో పండే వరి గింజలు పగిలి పోయి నూకలుగా మారుతాయని, ధాన్యం బాయిల్డ్ చేసి మరపట్టిస్తే నూకలు కావన్న విషయం కేంద్రమే చెప్పిందని, మనకు బాయిల్డ్ రైస్ చేసే విధానం నేర్పించి, పారాబాయిల్డ్ మిల్లులు పెట్టుకునేలా ప్రోత్సహించిందన్నారు. ఇంతకాలం సేకరించిన కేంద్రం ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొననంటోందని, కేంద్రం మెడలు వంచేదాకా మా పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.