హైదరాబాద్ టూర్‌లో భాగంగా.. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ప్రజలతో ఎన్నుకోబడినదని, వాళ్ళెవరూ నామినేటెడ్ పదవులలో లేరని అన్నారు. గుజరాత్‌లో లేని అభివృద్ధి తెలంగాణలో ఉండడం చూసి.. ఆ ఈర్ష్యతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. దేవుణ్ణి చూపించి, మూఢ నమ్మకాల రాజకీయాన్ని బీజేపీ నడుపుతోందని విమర్శించారు. కానీ, తాము మాత్రం దేవుణ్ణి కొలుస్తూ రాజకీయం చేస్తున్నామని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
అంతకుముందు.. హిందూ ఏక్తా యాత్రలో భాగంగా తెలంగాణలో మసీదుల్ని తవ్వాలని బండి సంజయ్ కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలపై గంగుల కమలాకర్ కౌంటర్స్ వేశారు. తన వ్యాఖ్యల్ని బండి సంజయ్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. మసీదుల్ని తవ్వడాన్ని పక్కనపెట్టి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంపై దృష్టి పెట్టాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దూసుకుపోతున్న తరుణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మతకలహాలు లేవని… ఇకపై కూడా రాష్ట్రం ప్రశాంతంగానే ఉండాలని చెప్పారు. మత కలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని… దీనికి గుజరాత్ రాష్ట్రమే ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. ఇతర మతాలను గౌరవించడాన్ని నేర్చుకోవాలని.. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని గంగుల కమలాకర్ వెల్లడించారు.