NTV Telugu Site icon

Munugode by-election: మునుగోడు బరిలో గద్దర్.. ప్రజా యుద్ధనౌకకు కేఏ పాల్‌ అవకాశం..

Gaddar

Gaddar

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నంత పని చేశాడు.. మునుగోడు ఉప ఎన్నిక బరిలో తమ పార్టీని అభ్యర్థిని పోటీకి పెట్టబోతున్నారు.. మునుగోడు ఉపఎన్నిలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రజా యుద్ధనౌకగా పేరు గాంచిన ప్రజాగాయకుడు గద్దర్‌ పేరును ప్రకటించారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గద్దర్.. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తానని ప్రకటించారు.. ఇక, ఆమరణ దీక్ష విరమించారు పాల్… గద్దర్ తనతో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అక్టోబర్ 2న పీస్ మీటింగ్ కు పోలీసులు పర్మిషన్ నిరాకరించడాన్ని నిరసిస్తూ కేఏ పాల్‌ ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే, గద్దర్ గతంలో తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలతో సన్నిహితంగానే ఉన్నారు. ఈ మధ్య పార్లమెంట్‌ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలంటూ.. అటు కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్ఎస్‌.. ఇలా అన్ని పార్టీల నేతలను కలిసి ఆయన మద్దతు కోరిన విషయం తెలిసిందే..

Read Also: KCR National Party: అప్పుడు కౌరవులపై పాండవుల విజయం.. ఇప్పుడు బీజేపీపై కేసీఆర్‌ విజయం..!

కాంగ్రెస్‌ కంటే ఈ మధ్య గద్దర బీజేపీతో సన్నిహితంగా మెలిగారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలవడం ఒక ఎత్తు అయితే… బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని.. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.. ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్న ఆ సభకు గద్దర్‌ కూడా హాజరు కావడం పెద్ద చర్చగా మారింది.. ప్రజా సమస్యలపై పాటలు పాడుతూ.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వచ్చిన గద్దర్.. బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా సాగింది.. ఎర్రగులాబీ కలర్‌ మారుతుందనే కథనాలు వచ్చాయి.. అయితే, ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆగా, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.. ఇక, సిట్టింగ్‌ స్థానం కోసం కాంగ్రెస్‌ తన శక్తినంతా ఒడ్డుతుంది.. ఇప్పటికే తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించి ప్రజల్లోకి వెళ్తోంది.. మరోవైపు.. మునుగోడుపై గురిపెట్టిన అధికార టీఆర్ఎస్‌ పార్టీ.. ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోయినా.. ప్రచారంలో దూసుకుపోతోంది.. ఇక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు కేఏ పాల్. రూ. 25 వేల కోట్ల బిజినెస్ ఇస్తామని బీజేపీ (పెద్దలు ఆఫర్ చేయడంతో ఆయన కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు అన్ని పార్టీల పనితీరు చూశారని, ఈ సారి తమ అభ్యర్థిని గెలిపిస్తే ఆరునెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. ఆ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14తో నామినేషన్ల గడువు ముగియనున్నది. నవంబర్‌ 3న ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా 6న ఓట్లను లెక్కించనున్నారు.

Show comments