కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం ఇస్తాం.. అవసరమైతే ఇంకా పొడిగిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రెండో రోజు సూర్యాపేట జిల్లాలో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాద్ర సాగుతోంది.. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన మెరుగు మారతమ్మ నివాసంలో అల్పాహార విందు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా ఆశీర్వాద్ యాత్ర చేస్తున్నట్టుగా తెలిపారు. యాత్రలో జాతీయ పారిశుధ్య కార్మికురాలు మెరుగు మారతమ్మను కలవడం సంతోషంగా ఉందని.. కరోనా కాలంలో ఒక్కరోజు కూడా పని మానకుండా ప్రజల ఆరోగ్యం కోసం పని చేసిన మారతమ్మ అభినందనీయరాలు అన్నారు.
ఇక, దేశ వ్యాప్తంగా కరోనా ఉచిత వాక్సిన్లను అందిస్తున్నాం, త్వరలోనే చిన్నారులకూ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు కిషన్‌రెడ్డి… ప్రజలు బాధ్యతగా వాక్సిన్లను తీసుకుని కరోనాని ఓడించాలని పిలుపునిచ్చిన ఆయన.. కరోనా కాలంలో బీదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం ఇస్తున్నాం.. అవసరమైతే ఇంకా పొడిగిస్తాం అన్నారు.. మరోవైపు.. కరోనా వారియర్లకు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నాం.. జర్నలిస్టులకు రూ. 5 లక్షల భీమా ఇస్తున్నాం.. కరోనా మృతుల పిల్లల చదువుల బాధ్యత కూడా కేంద్రం తీసుకుందని.. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు… కరోనా కష్ట కాలంలో పని చేసిన వారియర్లందరికి ఈ సందర్భంగా పాదాభివందనం అన్నారు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి.