తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కాబోతోంది.. రాష్ట్రవ్యాప్తంగా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయబోతున్నామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఒకేసారి 91 వేలకుపైగా ఉద్యోగాల భర్తీని ప్రకటించిన ఆయన.. వరుసగా నోటిఫికేషన్లు ఉంటాయని వెల్లడించారు.. ఇక, పలు జిల్లాల్లో నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు.. ఆరు నెలలు సినిమాలకు, సోషల్ మీడియాకు, మొబైల్ ఫోన్లకు.. దూరంగా ఉండడం.. కష్టపడండి.. మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చండి అంటూ మంత్రి కేటీఆర్ కూడా ఓ సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. అయితే, జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. కోచింగ్ సెంటర్స్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది మాత్రం హైదరాబాద్.. దీంతో, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న కసితో ఉన్న అభ్యర్థులు.. సిటీకి క్యూ కడుతున్నారు.. టీఎస్ సర్కారు జంబో కొలువుల భర్తీ ప్రకటనతో.. గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్‌కు పయనం అవుతున్నారు..
Read Also: Mukesh Ambani: అంబానీ చేతికి మరో దిగ్గజ సంస్థ
కరోనా మహమ్మారితో హైదరాబాద్‌లోని హాస్టళ్లను ఖాళీ చేసి ఊరిబాట పట్టారు చాలా మంది యువత.. సర్కార్ ప్రకటన తర్వాత ఇప్పుడు మళ్లీ సిటీ బాట పట్టారు.. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాల్లోని హాస్టల్స్ గదులకు డిమాండ్ అమాంతం పెరిగిపోయినట్టు చెబుతున్నారు.. కరోనా కొట్టిన దెబ్బతో ఆర్థికంగా నష్టపోయిన హాస్టల్స్ నిర్వాహకులు.. ఇదే అదునుగా భావించి.. గదులు, మెస్ చార్జీలు కూడా పెంచేపనిలో పడిపోయారట.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వచ్చే అభ్యర్థులు.. రూమ్ పెడితే వంటకు సమయం కేటాయించడం కొంత సమస్య అవుతుందని.. అదే హాస్టల్ అయితే ఏ సమస్య ఉండదన్న ఉద్దేశంతో.. హాస్టళ్లలో ఉండటానికి మొగ్గు చూపడంతో.. హాస్టల్స్ నిర్వాహకులు ఇదే అదునుగా భావిస్తున్నారని వాపోతున్నారు.. ఇక, సిటీలో వేలల్లో హాస్టళ్లు ఉన్నాయి.. కరోనా దెబ్బకు చాలా వరకు మూతబడినా.. ఆ తర్వాత క్రమంగా మళ్లీ తెరుచుకున్నాయి.. సిటీలో సాధారణ, లగ్జరీ, డీలక్స్ హాస్టళ్లున్నాయి. ఇందులో వసతి పొందేందుకు సౌకర్యాలకు తగట్టు నెలకు కనీసం రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు.. ఇక, కొన్ని హాస్టళ్లు విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలతో అనుసంధానంగా నడిపిస్తుంటారు.. మొత్తంగా కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు అందుబాటులో ఉన్న ఏరియాలో హాస్టళ్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు , జవహర్‌నగర్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, ఎల్లారెడ్డిగూడ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, దిల్‌సుఖ్ నగర్ సహా వాటి పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్లకు డిమాండ్ పెరిగిపోయినట్టు చెబుతున్నారు.