దేశంలో బాలికల చట్టబద్ద పెళ్లి వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం 20 ఏళ్లకే అమ్మాయిలు పెళ్లి చేసేసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 20ఏళ్ల వయసు లోపు పెళ్లైన యువతుల సంఖ్య 4.18 లక్షలుగా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం కొంత మంది తల్లిదండ్రులు ఆధార్ కార్డుల్లో తమ పిల్లల వయసు పెంచి చూపిస్తున్నారు.
కళ్యాణ లక్ష్మీ పథకం గణాంకాల ప్రకారం 21 ఏళ్ల లోపు పెళ్లి చేసుకున్న మహిళలు 3.39 లక్షల మంది ఉన్నారు. అంతేకాకుండా 79,057 మంది మైనారిటీ మహిళలు కూడా 21 ఏళ్ల లోపే పెళ్లి చేసుకున్నారు. అయితే 20 ఏళ్ల లోపే అమ్మాయిలకు పెళ్లి చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రభావం వారి పరిపక్వత, ఆర్థిక పరిస్థితులు, చదువుపై కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
అయితే పేదరికం, నిరక్షరాస్యత, ఆడపిల్లలకు పెళ్లి చేయాలనే తొందర.. తక్కువ వయసులో పెళ్లికి కారణాలుగా వాళ్లు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కేంద్రం 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు వివాహ వయసు పెంచితే అది అమ్మాయిల ఆర్థిక స్వాతంత్రానికి మంచి చేస్తుందని సూచిస్తున్నారు. అంతేకాకుండా కోవిడ్ వల్ల దేశంలో చైల్డ్ మ్యారేజెస్ లేదా తక్కువ వయసులో పెళ్లిళ్ల సంఖ్య మళ్లీ పెరుగుతున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి.