Fight Between AP Civil Police And TS SPF Police On Nagarjuna Sagar Dam: రెండు వర్గాల మధ్య ఏదైనా వివాదం చెలరేగినా, గొడవలు చెలరేగినా.. వాటి పరిష్కారం కోసం పోలీసుల్ని పిలుపిస్తాం. కానీ.. ఆ పోలీసుల మధ్య గొడవలు ఏర్పడితే? అలాంటి పరిణామమే నాగార్జున సాగర్ వద్ద నెలకొంది. పరస్పర సహకారంతో సన్నిహితంగా మెలగాల్సిన ఇరు రాష్ట్రాల పోలీసులు.. భేదాభిప్రాయాలతో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం పోయి, ‘నువ్వా-నేనా’ అని కాలర్ పట్టుకునేంత దాకా వెళ్తున్నారు. అసలేం జరిగిందంటే..
ప్రస్తుత తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణానదిపై నాగార్జున సాగర్ నిర్మించబడిన సంగతి తెలిసిందే! ఈ డ్యాంపై ఏపీ సివిల్ పోలిసులు, టీఎస్ ఎస్పీఎఫ్ పోలీసుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి వీరి మధ్య ఓ విషయమై గొడవ నెలకొంది. తొలుత ఈ డ్యాంపై తెలంగాణ పరిధిలోకి ఏపికి చెందిన ఓ సివిల్ ఎస్ఐ వాహనాన్ని.. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు అనుమతించలేదు. తమ పరిధిలోకి రానివ్వమంటూ వాళ్లు తెగేసి చెప్పారు. అప్పుడే ఇరువర్గాల మధ్య రగడ ఏర్పడింది. అనంతరం ఏపీ పోలీసులు వెనక్కు తగ్గి.. తమకూ సమయం రాకపోదా అని వేచి చూశారు.
అనుకున్నట్టుగానే ఆ సమయం వచ్చింది. తమ పరిధిలోకి వచ్చిన ఎస్పీఎఫ్ సిబ్బంది వాహనాలకు ఏపీ పోలీసులు చలానా విధించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఇష్యూ రిపీట్ అయ్యింది. ఎవ్వరూ వెనక్కు తగ్గకుండా పంతాలకు పోవడంతో వివాదం ముదిరింది. పరస్పర దూషణలకు దిగడమే కాదు.. ఒకానొక దశలో కొట్టుకునేంత పని చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దాకా చేరడంతో.. వాళ్లు రంగంలోకి దిగి ఇరువురిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పోలీసులు కొట్టుకున్నారన్న విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని, విషయం బయటకు రాకుండా రాజీ కుదురుస్తున్నట్టు తెలిసింది.