దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఫెర్రీ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లో మరో యూనిట్ నెలకొల్పేందుకు రూ. 500 కోట్లు పెట్టుబడి చేసేందుకు అంగీకారం తెలిపిందని మంత్రి కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా వెల్లడించారు. బుధవారం ఫెర్రీ ఫార్మా ప్రతినిధులతో సమావేశమైన తర్వాత, ఈ శుభవార్తను కేటీఆర్ తెలియజేశారు.
స్విట్జర్లాండ్‌కు చెందిన ఫ్రెర్రింగ్ ఫార్మా గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫార్ములేటింగ్ సెంటర్‌ను నెలకొల్పేందుకు రూ. 500 కోట్లు కేటాయించింది. రెండు నెలల కిందటే కేటీఆర్ దాన్ని ప్రారంభించారు. ఇంతలో దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలు జరగడం, ఆ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం కావడం జరిగింది. ఇందులో భాగంగానే రెండో యూనిట్ స్థాపనకు రూ.500 కోట్ల కేటాయించేందుకు ఫ్రెర్రీ ఫార్మా ముందుకొచ్చింది.
కాగా.. ఈ సదస్సులో కేటీఆర్ నాయకత్వంలోని టీమ్ తెలంగాణ వాయువేగంతో దూసుకెళ్తుండడంతో, రాబోయే 20 ఏళ్లలో కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఏంజెల్ ఇన్వెస్టర్ ఆశా జడేజా మోత్వాని ప్రశంసల వర్షం కురిపించారు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ నాయకుడ్ని నేను నా జీవితంలో ఇంతవరకూ చూడలేదని.. తెలంగాణ టీమ్‌ను చూస్తుంటే తనకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకొచ్చాయని ఆమె అన్నారు.
ఇదిలావుండగా.. ఈ సదస్సులో భాగంగా ఆశీర్వాద్ పైప్స్ (Aliaxis) గ్రూప్ తెలంగాణలో రూ.500 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపినట్టు ఇంతకుముందే కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు యూఏఈకి చెందిన లూలూ గ్రూప్ తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్లు ఆయన ప్రకటించారు. అటు, ఈ-కామర్స్ సంస్థ ‘మీషో’ తెలంగాణలో ఫెసిలిటీ సెంటర్ పెట్టేందుకు అంగీకరించింది.
More good news coming in for #Telangana from Davos!
Delighted to announce that Switzerland headquartered @ferring Pharma will be expanding in Hyderabad with an investment of ₹ 500 Crores for setting up of another formulation unit#TelanganaAtDavos #InvestTelangana #WEF22 pic.twitter.com/3nkVzP5PEB
— KTR (@KTRTRS) May 25, 2022