తెలంగాణ సీఎం గొప్ప సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ధరణి పోర్టల్, భూ సమస్యల పరిష్కారం డిమాండ్‌తో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అన్నింట్ల ముందంటివి.. వరి పండించడంలో రాష్ట్రం ముందంటివి.. ఇప్పుడూ వరి వేస్తే ఉరి అంటున్నావు ఏంటి? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. నేను కూడా ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌నేనని గుర్తుచేసుకున్న ఆయన.. ఫస్ట్ సాఫ్ట్‌వేర్ రెడీ చేసి ముందు సాధ్యాసాధ్యాలపై టెస్టులు చేయాలి.. కానీ, దానిపై కేసీఆర్ తో మాట్లాడాలంటే అధికారులకు భయం, దాంతో చేయరంటే చేయరు అంతే అన్నారు. అసలు ధరణి ఒక సాఫ్ట్‌వేర్ కాదు.. ఇదొక కుట్ర అని కామెంట్ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఎక్కడికి పోయినా ధరణి సమస్యలే ఉన్నాయన్నారు.. భూములు ఇచ్చి గుంజుకుంటున్నారని ఆరోపించారు. మీ అందరిలాగే నాకు ధరణి సమస్య ఉందన్న మాజీ ఎంపీ.. పోర్టల్‌లో లోపం ఉంటే.. సర్వర్ డౌన్ అని అంటారని.. వాళ్లపని అయితే జల్దీ అవుతుంది.. పక్కవాళ్లది మాత్రం కావడంలేదని మండిపడ్డారు.