తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఎర్రటి ఎండలో బండి సంజయ్ పాదయాత్ర చేశారని, పాదయాత్ర లో ప్రజలను జాగృతం చేశారన్నారు. రాబోయే కాలంలో ఈ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానేనని, ప్రజా సంగ్రామ యాత్ర అన్ని ప్రాంతాల్లో జనాలను జాగృతం చేయనుందని ఆయన వెల్లడించారు. కేసీఆర్ 8 ఏళ్ల కాలంలో ప్రజలచేత అసహ్యయించుకున్న ఏకైక నాయకుడని, 2014లో నేను తొలి ఆర్ధికమంత్రి గా ప్రమాణం చేసినప్పుడు… అప్పటి అప్పు కేవలం రూ.70 వేల కోట్లే.. ప్రస్తుతం 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ గా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన ఆరోపించారు.
ఇది ఎడ్డీ, గుడ్డి తెలంగాణ కాదు… ఇది చైత్యన తెలంగాణ.. ప్రజలు కేసీఆర్ ను తన్ని తరిమేస్తారు అని ఆయన హెచ్చరించారు. లక్షా 50 వేల బెల్టు షాపులు… వేలాది బార్ల షాపు లు పెట్టిండు కేసీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. తాగుడులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 అని.. లిక్కర్ ఆదాయంపై అసెంబ్లీలో హరీష్ రావు సిగ్గు లేకుండా ప్రకటించుకున్నాడని, రైతులకు రైతుబంధు ఇచ్చి, పంటలు వేయొద్దని రైతుల కళ్ళల్లో దుమ్ము కొట్టిన సీఎం కేసీఆర్ అని ఈటల మండిపడ్డారు.