Etela Rajender Comments On KCR In BJP Munugodu Meeting: వామపక్షాలు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా తప్పు పట్టారు. అలా చేస్తే, తెలంగాణ ప్రజలు ఏమాత్రం క్షమించరని అన్నారు. మునుగోడు సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మిత్రుడని, మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే ఆయన రాజీనామా చేశాడని అన్నారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో పదవి వదులుకున్న ఆయన్ను.. నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరారు. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ కన్నా గొప్ప తీర్పు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మునుగోడులో బీజేపీ వస్తే ఏం జరుగుతుందోనని కేసీఆర్ భయపడుతున్నారని, ఆ భయంతోనే నిన్న మునుగోడులో సభ నిర్వహించారని ఈటెల విమర్శించారు. బీజేపీ సభ సక్సెస్ కాకూడదనే ఆ కుట్ర పన్నారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే బంగాళఖాతంలో వేస్తారని కేసీఆర్ తన గురించే చెప్పుకున్నారని, అది తప్పకుండా జరుగుతుందని చెప్పారు. ఓటమి భయం చుట్టుకోవడం వల్లే.. మోటార్లకు మీటర్లు పెడ్తారన్న అబద్ధప్పు ప్రచారానికి కేసీఆర్ తెరతీశారన్నారు. ఇదే సమయంలో వామపక్ష నాయకులు కేసీఆర్‌తో కలవడం కన్నా హీనమైన చర్య మరొకటి లేదని విమర్శించిన ఆయన.. మీరెప్పుడైనా ప్రగతి భవన్ వెళ్లారా? అంటూ సీపీఐ, సీపీఎం నాయకుల్ని ప్రశ్నించారు. ఇందిరా పార్కు వద్ద ధర్నాలు నిషేధించిన నాయకుడు కేసీఆర్ అని, ట్రేడ్ యూనియన్లు లేకుండా చేసిన ఘనత కూడా ఆయనదేనని ఈటెల రాజేందర్ వెల్లడించారు.
ట్రేడ్ యూనియన్లు సమ్మె చేస్తే.. ఏనాడైనా పిలిచి సమస్యను పరిష్కరించారా? అంటూ ఈటెల నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణం కాదా? ఎన్నో కుట్రలు చేసిన కేసీఆర్ ప్రగతి కామకుడిగా కనిపించాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యావాలంటీర్లకు కూడా జీతాలు ఇవ్వడం లేదన్నారు. వారి బాధలు మీకు అర్థం అవుతోందా? అని సీఎంని అడిగే దమ్ముందా? అంటూ ఈటెల ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీని ఓడించి, బీజేపీని గెలిపించాల్సిందిగా ఈటెల కోరారు.