తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. 7 ఏళ్ళ బడ్జెట్ పై చర్చకు సిద్ధమా అని మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. అనుభవజ్ఞుడిని, మీ బడ్జెట్‌లో లొసుగులు తెలుసు కాబట్టి.. అసెంబ్లీలో లేకుండా చేయడానికి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. కేంద్రంపై బడ్జెట్ ప్రసంగంలో విమర్శలు చేయడాన్ని హరీష్ రావు విజ్ఞతకు వదిలేస్తున్నానని, 2014లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు 79 వేల కోట్లు అని, ప్రస్తుతం తెలంగాణ అప్పు 3,29,988 కోట్లు అని ఆయన అన్నారు.
హరీష్ రావు కు బడ్జెట్ రూపకల్పన లో సంబంధం ఉందా…? ఆర్థిక మంత్రి తో సమీక్ష చేసే విధానాన్నీ సీఎం ఎత్తేశారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ్యుల హక్కులను కాలరాశారని, మా సీట్లలో మేము నిలబడి నిరసన తెలుపుతావుంటే అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. మా హక్కులను హరిస్తే స్పీకర్ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించారని, గవర్నర్ ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) చట్టం అన్ని రాష్ట్రాలకు కామన్ అని, కరోనా కారణంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు 3 నుంచి 5 శాతం వరకు అధిక రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.