Election Commission: తెలంగాణ రాష్ట్రంలోని 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ. సుధర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం ఈ ఆర్‌యూపీపీలు గత ఆరు సంవత్సరాలలో సాధారణ, శాసనసభ లేదా ఉప ఎన్నికలలో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టలేదు.. దీంతో ఈ పార్టీలు చట్టంలో రూపొందించినట్లు వ్యవహరించకపోవడంతో ఇవి రాజకీయ పార్టీలుగా పని చేయలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఈ 13 పార్టీలను రాజకీయ పార్టీల రిజిస్టర్ నుంచి తొలగించాలని ఈసీఐ ప్రతిపాదించింది.
Read Also: Kharge Serious On MLAs: ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఖర్గే సీరియస్.. గ్రూపులు కడితే భయపడేది లేదు..
అయితే, సదరు పార్టీలకు తమ వివరణ సమర్పించే అవకాశం కల్పించింది తెలంగతాణ ఎన్నికల కమిషన్. ఈ షోకాజ్ నోటీసులు 2025 జులై 11వ తేదీ నాటికి రాతపూర్వక వివరణ ఇవ్వాలని తెలిపింది. సహాయక పత్రాలతో పాటు పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి నుంచి అఫిడవిట్ సమర్పించాలని ఈసీ ఆదేశించింది. అంతేకాక, జులై 15వ తేదీ 2025న విచారణకు హాజరు కావాలని సూచించింది. పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి లేదా పార్టీకి చెందిన ప్రతినిధి తప్పనిసరిగా హాజరు కావాలని వెల్లడించింది. తమ నోటీసులకు స్పందించకపోయిన, విచారణకు రాకపోయిన ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సుధర్శన్ రెడ్డి హెచ్చరించారు.
Read Also: Cyberabad Police: స్పా సెంటర్లకు ఇక దబిడి దిబిడే.. హెచ్చరికలు జారీచేసిన పోలీసులు
షోకాజ్ నోటీసులు అందిన 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఇవే..
1. తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ
2. ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ
3. జాగో పార్టీ
4. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్
5. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ
6. తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం
7. యువ పార్టీ
8. బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే)
9. తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ
10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ
11. జాతీయ మహిళా పార్టీ
12. యువ తెలంగాణ పార్టీ
13. తెలంగాణ ప్రజా సమితి (కిశోర్, రావు మరియు కిషన్)