హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ధూల్ పేటలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు ఒక ఆఫ్రికా దేశస్థుడిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను తరలించేందుకు వాడుతున్న ఇన్నోవా కార్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రీకన్ దేశస్తుడు, సందీప్ అనే వ్యక్తికి అమ్ముతున్న క్రమంలో పురానా పూల్ వద్ద పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. హోండా యాక్టీవా పట్టుకున్నామని.. అందులో ఏడు గ్రాముల కొకైన్ దొరికినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ వెల్లడించారు. ఆఫ్రికా దేశస్థుడు ఇచ్చిన సమాచారంతో మరో వ్యక్తిని కూడా పట్టుకున్నట్లు వెల్లడించారు. అతని కారులో 11 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సన్ సిటీలో నివాసం ఉంటున్న ఆఫ్రికా వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించామని తెలిపారు. అక్కడ మరో 38 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. మొత్తంగా 56 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఆఫ్రికన్ వ్యక్తి వనస్థలిపురంతో పాటు సన్ సిటీ నుంచి సప్లై చేస్తున్నట్లు అధికారులు కనుక్కున్నారు. బ్రూ కాఫీ ప్యాకెట్లలో ఎవరికి అనుమానం రాకుండా అందులో ఉంచి కొకైన్ విక్రయిస్తున్నట్లుగా అధికారులు తేల్చారు. ఒక్కో ప్యాకెట్ లో ఒక్కో గ్రాము కొకైన్ ను ఉంచి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. పాతవాళ్ళకి ఐదు వేలు కొత్త వాళ్ళకి ఆరు వేలకు విక్రయిస్తున్నాడని.. ఢిల్లీ నుండి తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నాడని అధికారులు వెల్లడించారు. సదరు ఆఫ్రికన్ వ్యక్తి ఫార్మసీ స్టూడెంట్ వీసా తో వచ్చాడని అధికారులు తెలిపారు.
ఒక మసాలా కంపెనీ వాళ్ళకు చెందిన యజ్ఞానంద్ ఇన్నోవా కారులో తరలిస్తున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. యజ్ఞానంద్ చార్మినార్ లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ గతంలో పలుమార్లు యజ్ఞానంద్ డ్రగ్స్ ను తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలిందని… మూడు లక్షల విలువైన కొకైన్ పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. యజ్ఞానంద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గతంలో కూడా ఓ కేసులో అరెస్ట్ అయిన నాలుగు నెలల తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు.