Telangana Congress Leader Dasoju Sravan Kumar Fired on TRS Government.
మరోసారి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మాట్లాడుతూ.. పేదోళ్ల భూములని ప్రభుత్వమే కబ్జా చేయాలని చూస్తుందని ఆరోపించారు. 2014 ఎన్నికలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా అసెంబ్లీ వేదికగా కేసీఆర్ దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని చెప్పలేదు అన్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక పేదోళ్ళు భూస్వాములు కాలేదు.. టీఆర్‌ఎస్ వాళ్లే భూస్వాములు అయ్యారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ నాయకులు బ్లాక్ మెయిలర్స్ గా మారారని, గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం గుంజుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వాలు 25 లక్షల మందికి భూముల్ని ఇస్తే.. ఈ ప్రభుత్వం అ భూముల్ని గుంజుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ, పీవీ నర్సింహారావు లాంటి వాళ్ళు పేదలకు భూ సంస్కరణలు చేసి భూములు పంచారని, పేదల భూముల తీసుకొని ప్రభుత్వం రియల్ స్టేట్ చేస్తోందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇవ్వకపోగా దళితుల భూములు గుంజుకుంటున్నారని, ఆదాయం కోసం ప్రభుత్వం పేదల భూముల్ని తీసుకుంటూ…పేదలకి మందు తాగిస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో భూ దందా జరుగుతుందని, రియల్ స్టేట్ దందా మాని.. పరిపాలన చేయండని ఆయన హితవు పలికారు.