15 ఏళ్లనాటి పగ.. దానిని అందరూ మర్చిపోయారు.. కానీ కొడుకు మాత్రం మర్చిపోలేదు.. తండ్రిని చంపిన హంతకులను ఎలాగానే చంపాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం బాగా కష్టపడి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతరించాడు. కోట్ల కొద్ది డబ్బులు సంపాదించాడు. తన తండ్రిని మట్టు పెట్టిన హంతకుల కోసం గాలించాడు. చివరికి హంతకులు దొరికారు. అయితే తాను హత్య చేయకుండా మరొకరి చేత హత్య చేయించాడు. రూ. 30 లక్షలను సుఫారీ గ్యాంగ్ ఇచ్చాడు. కర్ణాటక సుపారీ గ్యాంగ్ హైదరాబాద్ వచ్చి హత్య చేసి రూ.30 లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది. ముందుగా ఈ సంఘటనను రియల్ ఎస్టేట్ కు సంబంధించిన హత్యగా పోలీసులు భావించారు. పోలీస్ విచారణలో అసలు విషయం తెలియడంతో సుఫారీ గ్యాంగ్ తో పాటు హంతకులను పట్టుకున్నారు.
కత్తులు.. వేట కొడవళ్లతో ఓ రియల్టర్ దారుణ హత్య చేశారు..ఎలాంటి ఆధారాల్లే లేకుండా జాగ్రత్తలు పడ్డారు. సీసీటీవీ ఫుటేజీతో పెద్ద ఎత్తునా గాలించినా.. నిందితులు ఎక్కడ కూడా పోలీసులకు చిక్కలేదు. అంతేకాకుండా ఆధారాలు లేకుండా నిందితులు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు పడ్డారు. అత్యంత జాగ్రత్త తీసుకొని రియాల్టర్ ను పక్క ప్లాన్ తో హత్య చేశారు. అయినా.. ఆ హత్య కేసు మిస్టరీని ఐదు రోజుల్లో రాచకొండ పోలీసులు ఛేదించారు. నిందితులకు బేడీలు వేసి.. చట్టం ముందు నిలబెట్టారు.
ఈ నెల 15న జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో ఓ వైన్స్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రియల్టర్ రఘుపతి అలియాస్ రఘు, అతని మిత్రుడు ప్రసాద్‌పై కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రఘుపతి అక్కడికక్కడే మృతి చెందారు. జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలపై దృష్టిసారించారు. సీసీటీవీ ఫుటేజ్ వంటి వాటితో పెద్దగా ఫలితం లేకపోవడంతో పోలీసులు హ్యూమన్ ఇంటెలిజెన్స్ పైన దృష్టి సారించారు. మల్కాజిగిరి ఎస్‌వోటీ, జవహర్‌నగర్ క్రైమ్‌టీమ్‌లు రంగంలోకి దిగాయి. రఘుపతి పైన గతంలో ఉన్న కేసుల నేపథ్యాన్ని పోలీసులు బయటికి తీశారు. గతంలో ఉన్న కేసులు, ప్రత్యర్థులపై పోలీస్ లు దృష్టి సారించాయి. ఈ క్రమంలో.. 2009లో దమ్మాయిగూడ ఉప సర్పంచిగా ఉన్న జంగారెడ్డి అనే వ్యక్తి హత్యలో రఘుపతి కీలక పాత్ర ఉన్నట్లు గా పోలీస్ పోలీసులు గుర్తించారు.. అంతే.. జంగారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బట్టబయలు అయింది. రఘుపతి హత్య కేసు చివరికి మిస్టరీ వీడింది. రూ.30 లక్షలను కర్ణాటకకు చెందిన సుపారీ గాంగ్ కు ఇచ్చి మరీ రఘుపతిని చంపించినట్లు శ్రీకాంత్‌రెడ్డి అంగీకరించాడు. తన తండ్రికి మిత్రుడైన కర్ణాటక వాసి మంజునాథకు ఆ సుపారీ ఇచ్చినట్లు పోలీసులకు చెప్పాడు. ఒప్పందంలో భాగంగానే కర్ణాటక నుంచి గ్యాంగ్ తీసుకువచ్చి రఘుపతిని మంజునాథ్ చంపించాడు.
రఘుపతిని చంపేందుకు ఒప్పుకొన్న మంజునాథ.. తనతోపాటు భవిత్, మహమ్మద్ సాధిక్, ఇస్మాయిల్, సమీర్‌ఖాన్‌లను నగరానికి తీసుకువచ్చాడు. రఘుపతిని చంపడానికి మూడు రోజులపాటు రెక్కీ వేశారు. ఈ నెల 15న రఘుపతి, అతని స్నేహితులు ప్రసాద్, బాబు, రామానుజన్ దమ్మాయిగూడలోని వైన్స్ వద్ద మద్యం సేవిస్తుండటంతో.. కత్తులు, వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రఘుపతిని ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్వల్పగాయాలైన ప్రసాద్ కోలుకుంటున్నారు. హత్య జరిగిన వెంటనే శ్రీకాంత్‌రెడ్డి నుంచి రూ. 30 లక్షలు తీసుకున్న కర్ణాటక ముఠా అక్కడ నుంచి పరారైంది. మారణాయుధాలను కీసర సమీపంలోని చెట్ల పొదల్లో పారేసి గాంగ్ పారిపోయింది. ఐదు రోజుల వ్యవధిలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసు చేధించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. నిందితులందరినీ అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.