తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం.. హాట్ టాపిక్‌గా మారింది. అయితే, సర్కార్ సైతం.. ఈ పథకాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తోంది. దళిత సమాజానికి ఈ పథకం గురించి వివరిస్తూ.. ప్రత్యేక పాటలు రూపొందించి ప్రచారం కల్పిస్తోంది. ఇప్పుడెక్కడ చూసినా.. దీనిపైనే చర్చ జరుగుతోంది. దళితుల సాధికారత కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి అద్భుతమైన పాటలతో… అంతే స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది ప్రభుత్వం. నిజానికి.. ఈ పథకాన్ని ఈనెల 16న హుజురాబాద్ వేదికగా.. సీఎం కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది.
కానీ, ఈ పథకం అమలుపట్ల కృత నిశ్చయంతో ఉన్న కేసీఆర్.. అంతకు ముందే అంకురార్పరణ చేశారు. తన దత్తత గ్రామం వాసాల మర్రిలోనే.. దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడ అర్హులైన 76 దళిత కుటుంబాలకు 10లక్షల చొప్పున దళితబంధు సాయం ఇచ్చేశారు. దీంతో ఈ పథకంపై అంచనాలు రెట్టింపయ్యాయి. అంచనాలకు తగ్గట్టే.. ఈ పథకానికి పాటలతో ప్రచారమూ కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకణ్ణ స్వరం కూడా.. ప్రభుత్వం రూపొందించిన దళిత బంధు పాటల్లో జత కలిసింది. దళిత సోదరా అంటూ ఆయన పాడిన పాట అందరినీ అలరిస్తోంది. దళితుల్లో ఈ పథకంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక పాటల్ని రూపొందించినట్టు తెలుస్తోంది.