Cyber Crimes In The Name of Minister Niranjan Reddy: జనాల నుంచి డబ్బులు దోచుకోవడం కోసం.. సైబర్ నేరగాళ్లు పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సైబర్ నేరాల పట్ల జనాలకూ మంచి అవగాహన వచ్చేసింది కాబట్టి.. వారిని బురిడీ కొట్టించేందుకు కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ప్రైజ్‌మనీ, ఆఫర్ల వంటి వాటిని పక్కనపెట్టి.. జనాలు నమ్మగలిగే సరికొత్త ప్లాన్స్‌ని ఆవిష్కరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ఆఖరికి జడ్జీలను సైతం వదిలిపెట్టట్లేదు. వారి పేర్లను అడ్డం పెట్టుకొని.. ప్రజలకు శఠగోపం పెట్టి, సునాయాసంగా డబ్బులు దండేసుకుంటున్నారు. తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని పేరుని వినియోగించి.. కొందరు దుండగులు సైబర్ నేరాలకు పాల్పడ్డారు.
కొందరు దుండగులు నకిలీ నంబర్లు, డీపీలు పెట్టి.. మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో కొందరికి వాట్సాప్ మెసేజ్‌లు పంపించి మోసాలకు పాల్పడ్డారు. మంత్రి పేరు ఉండటం చూసి.. చాలామంది మోసపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి.. తన పేరిట వస్తున్న వాట్సాప్ సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని సూచించారు. నకిలీ నెంబర్లు, డీపీలతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, తన పేరు చెప్పి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. తన పేరిట వచ్చే సందేశాలపై ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరూ స్పందించొద్దని తెలిపారు. మరీ ముఖ్యంగా.. 9353849489 నంబర్ నుంచి సందేశాలు వస్తే, రియాక్ట్ అవ్వొద్దని నొక్కి చెప్పారు. సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా చర్యలు చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు.