ఈమధ్యకాలంలో రైల్వే ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అయితే, సకాలంలో స్పందించిన పోలీసులు ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా వరంగల్ లో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరిచేత ప్రశంసలు లభిస్తున్నాయి. 20 మంది సభ్యుల బృందం కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తోంది. వరంగల్ జిల్లా భీమారం గ్రామానికి చెందిన ఒక మహిళ కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తుండగా ట్రైన్ వరంగల్ లో ఆగిన సందర్భంలో దిగలేకపోయింది. ట్రైన్ కదిలిపోయింది. అయితే, ఆమహిళ రన్నింగ్ ట్రైన్ నుంచి ఫుట్ బోర్డు మీద వేలాడుతూ.. ప్లాట్ ఫాం మీదకి దూకేసింది.
ఆ సమయంలో ఆమె పట్టాలమీద పడబోయే సమయంలో అత్యంత చాకచక్యంగా అక్కడే విధుల్లో వున్న కానిస్టేబుల్ చిన్నరామయ్య ఆమెను ఒడుపుగా పట్టుకుని ప్లాట్ ఫాం మీదకి లాగేశారు. ఆమెతో పాటు కానిస్టేబుల్, మరో ప్రయాణికుడు కింద పడ్డారు. ఆసమయంలో కానిస్టేబుల్ చిన్నరామయ్య స్పందించకపోయి వుంటే దురదృష్టం ఆమెని వెంటాడేది. విధి నిర్వహణలో ఎంతో సాహసం, మానవత్వం చూపించిన చిన్నరామయ్యను ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. చిన్న రామయ్య జాతీయ అథ్లెట్. క్రీడారంగంలో పనిచేసిన చిన్నరామయ్య సెకన్ల వ్యవధిలో స్పందించి ప్రమాదం నుంచి మహిళను కాపాడారు. గతంలోనూ వరంగల్ రైల్వేస్టేషన్లో ఓ యువకుడిని రైలు కింద కుండ పడకుండా కాపాడారు రైల్వే పోలీసులు. రైలు ప్రయాణంలో అప్రమత్తంగా వుండాలని ప్రమాదాల బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలని రైల్వే, పోలీసులు కోరుతున్నారు.