ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రెండు మూడు రోజులుగా మాజీ ప్రధాని పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నరేంద్రమోడీ వ్యాఖ్యలు సరికాదు. నరేంద్రమోడీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల తాళిబొట్లు తెంచుతారని మాట్లాడటం సరికాదని శోభా రాణి హితవు పలికారు. మోడీ దేశ ప్రజలందరికి ప్రధాని కాదా? ముస్లిం మైనారిటీలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆమె ధ్వజమెత్తారు. మోడీకి తాళిబొట్టు విలువ తెలియదని, దేశం కోసం తాళిబొట్టును వదులుకున్న వ్యక్తి సోనియాగాంధీ అని ఆమె అన్నారు.
అనంతరం కాంగ్రెస్ నేత రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, మోడీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.. నర్సారెడ్డి భూపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో చూసి మోడీ భయపడుతున్నారని, ప్రజలు కులాలు, మతాలు, వర్గాలుగా విడగొట్టి రెచ్చగొడుతున్నారన్నారు. నరేంద్ర మోడీ, ఆ పార్టీకి చెందిన నాయకులను ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.