తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా్ల్లో కొనసాగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఎన్నో వాగ్ధానాలు చేశారు.. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులే కొనసాగుతున్నాయి కానీ.. కొత్తవేమి లేవని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన హామీ 8 ఏండ్లు అవుతున్నా ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లో బిజీ అయ్యి… ఇచ్చిన హామీలు మర్చిపోయారని, అందుకే ఇచ్చిన మాటలు గుర్తు చేస్తున్నామన్నారు జగ్గారెడ్డి.
జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏమయ్యాయి.? 33 ఆసుపత్రులు ఎప్పుడు ప్రారంభిస్తారు.? ఇంకో ఏడాదిలో ఎన్నికలే వస్తాయి.. ఇచ్చిన మాట అమలు ఏం చేశారు.? 590 మండలాల్లో 590 ఆసుపత్రుల శంకుస్థాపన ఎప్పుడు..? నియోజకవర్గంకి 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన ఎప్పుడు..? అని ఆయన ప్రశ్నించారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ మేనిఫెస్టోనే మేము గుర్తు చేస్తున్నామని, సీఎం అయ్యాక కేసీఆర్ మేనిఫెస్టో మర్చిపోయారన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే కార్యాచరణ చేపడతామని ఆయన వెల్లడించారు. ఆరోగ్య శ్రీ.. అమలు ఏమైంది .? పేదలకు ఆరోగ్య శ్రీ భరోసా ఇచ్చింది కానీ మీరెందుకు అమలు చేయడం లేదు. కేసీఆర్ సీఎం అయ్యాక ఆరోగ్య శ్రీ ఏమైంది.? కార్పొరేట్ ఆసుపత్రుల్లో కనుమరుగు అయ్యిందని ఆయన మండిపడ్డారు.