పార్టీ ఒకటే కానీ నేతలు వేరయ్యారు. విడిపోయారు. అసలే ప్రజాస్వామ్యం ఎక్కువైన కాంగ్రెస్ పార్టీలు ఆందోళనల్లోనూ ఎవరి ధోరణిలో వారు ముందుకెళుతున్నారు. సంగారెడ్డీ జిల్లా కేంద్రంలో పెంచిన వంటగ్యాస్,పెట్రోల్ ధరలు తగ్గించాలని పోటాపోటీగా ధర్నాలు నిర్వహించారు సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ ధర్నాతో సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడం చర్చకు దారితీస్తోంది. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ వర్గం, జగ్గారెడ్డి వర్గం వేర్వేరు చోట్ల ధర్నాలు నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. తలపై కట్టెలు పెట్టుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీతో ధర్నా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజీల్, వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్న శంకర్ రెడ్డి అధ్వర్యంలో మరో వర్గం నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్యాస్ సిలిండర్ కు పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్న శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ఆర్ధిక భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని తెలిపారు. కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతూ పోతే సామాన్యులు బతికే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ , టీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించకపోతే నిరసనలను ఉధృతం చేస్తామన్నారు. ఒకే పార్టీకి చెందిన నేతలు ఇలా పోటాపోటీగా ధర్నాలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.