హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ ప్రజలు మొత్తం ఉత్కంఠగా ఎదురుచూశారు.. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరా జరిగినా.. ఈటలకు భారీ మెజార్టీయే దక్కింది.. అయితే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బై పోల్‌లో చతికిలపడిపోయింది.. అయితే, గత ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో 3 వేలకు పరిమితం కావడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీనిపై కాంగ్రెస్ పార్టీలో దుమారమే రేగింది.. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు కొందరు సీనియర్లు.. మరోవైపు.. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది.. దీనికోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు.
Read Also: ‘గేట్ వే’పై సైబర్ ఎటాక్.. కోట్లలో కొట్టేశారు..!
దీంతో.. హుజురాబాద్ ఉప ఎన్నిక పంచాయతీ హస్తినకు చేరినట్టు అయ్యింది.. ఈ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేయడానికి ఎన్నికల్లోపనిచేసిన బాధ్యతుల ఢిల్లీకి రావాలని హైకమాండ్ ఆదేశించింది. పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, వీహెచ్‌లకు పిలుపు వచ్చింది. దీంతో నేతలందరూ ఢిల్లీకి పయనం అయ్యారు.. రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలతో సమావేశం కానున్నారు.. హుజురాబాద్ ఎన్నికల్లో ఎవరెవరు ఏం చేశారు? పార్టీకి నష్టం కలిగించిన అంశాలు ఏంటి? ఇలా అన్ని అంశాలతో నివేదికతో రావాలని అధిష్టానం సూచించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన వెంకట్ కూడా పార్టీ నేతలపై నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. పార్టీకి నష్టం కలిగించిన కరీంనగర్ జిల్లా నాయకులు, హుజురాబాద్‌లో నాయకుల పరిస్థితి, ఓట్లు ఎందుకు పడలేదు అనే అంశాలపై హై కమాండ్ నివేదిక కోరినట్టు సమాచారం. ఇక, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎలాంటి నివేదిక ఇస్తారు… మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాంటి అంశాలు తెరపైకి తెస్తారు.. సీనియర్లు అధిష్టానానికి ఎవ్వరిపై ఫిర్యాదులు చేస్తారు అనే ది ఆసక్తికరంగా మారింది.