Coal belt: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం దిశగా దూసుకుపోతోంది. 119 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 60ని దాటిన కాంగ్రెస్, స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇదిలా ఉంటే సింగరేణితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కోల్‌బెల్ట్ నియోజకవర్గాల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది.
ఆదిలాబాద్ నుంచి మొదలుపడితే ఖమ్మం వరకు ఉన్న కోల్‌బెల్ట్ రీజియన్‌లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ కనిపించడం లేదు. సింగరేణి కార్మికులు గెలుపోటములను ప్రభావితం చేసే ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ని స్పష్టంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సింగరేణి కార్మికుల్లో గతం నుంచి బీఆర్ఎస్ పట్ల విముఖత కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది.
Read Also: Chandrababu: ముందంజలో కాంగ్రెస్.. పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు కీలక సందేశం!
తెలంగాణలోని ఆరు జిల్లాలు.. కుమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. ప్రాణహిత- గోదావరి ప్రాంతాలను ఆనుకుని ఉన్న 12 కోల్ బెల్ట్ నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో పడబోతుననాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూర్, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు నియోజవర్గాల్లో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది.2018 ఎన్నికల్లో కూడా సింగరేణి ఏరియాలో కాంగ్రెస్ మంచి విజయాలను సాధించింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఆ తరువాత పరిణామాల్లో బీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా ఈ ఎన్నికల్లో మాత్రం సింగరేణి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది.