CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. తెలంగాణ చరిత్ర, పోరాటాల నేపథ్యాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన దార్శనిక ఆలోచనలను ఆయన వెల్లడించారు. తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉందని, ఇది జల్, జంగిల్, జమీన్ కోసం కొమురం భీమ్ పోరాడిన పవిత్ర గడ్డ అని సీఎం పేర్కొన్నారు.
ఈ నేల భూమి కోసం, బతుకు కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది ప్రాణాలర్పించిన చరిత్ర కలిగి ఉందని సీఎం గుర్తు చేశారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోందని, ప్రజలు కోరుకున్న ఆ స్వప్నాలను నిజం చేయడానికే తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామని తెలిపారు.
2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసిన పత్రం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలను సమీకరించి రూపొందించిన డాక్యుమెంట్ అని స్పష్టం చేశారు.
భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేస్తూ, ఇప్పుడు తమ ప్రభుత్వం విద్య, ఇరిగేషన్, కమ్యూనికేషన్ అనే నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
కొంతమందికి పేదరికం ఒక అనుభవం లేదా ఎక్స్కర్షన్‌లా ఉంటుందని వ్యాఖ్యానించిన సీఎం, తనకు పేదరికం అంటే ఏమిటో బాగా తెలుసన్నారు. తాను గ్రామీణ ప్రాంతానికి చెందినవాడినని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినవాడినని చెప్పారు. పేదలు, దళితులు, ఆదివాసీలతో తనకు బలమైన అనుబంధం ఉందని, వారి కష్టాలు తెలిసిన వ్యక్తిగా ప్రతి పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే తన తపన అని అన్నారు.
విద్యార్థి దశ నుంచే కులవివక్షను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీలకు ఒకే చోట నాణ్యమైన విద్య అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని సీఎం వెల్లడించారు. దీన్ని ఖర్చుగా భావించడం లేదని, తెలంగాణ భవిష్యత్తుకు పెట్టుబడిగా చూస్తున్నామని తెలిపారు.
నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడమే నిరుద్యోగానికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించిన సీఎం, యువతలో స్కిల్స్ పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు, ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అట్టడుగు వర్గాలు, పేదల అభివృద్ధే తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్, అసలు సారమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, సుస్థిర అభివృద్ధితో తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.