Site icon NTV Telugu

CM Revanth Reddy : శిల్పా రామం మేం కడితే… ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి రహమత్‌ నగర్‌లో రోడ్‌ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. “శిల్పా రామం మేం కడితే… ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు. మేమే మెట్రో తెచ్చాం. కానీ ఇవాళ క్రెడిట్‌ వేరేవాళ్లు తీసుకుంటున్నారు,” అని సీఎం రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. తదుపరి మాట్లాడుతూ, “జన్వాడ, గజ్వేల్, ఎర్రవల్లిలో ఫార్మ్‌హౌస్‌లు కట్టుకున్నారు. కాదని చెప్పమనండి. 100 బస్సులు పెట్టీ చూపిస్తా. నాలుగు ఫార్మ్‌హౌస్‌లు కావాలంటే చెప్పండి… ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చాయి?” అంటూ కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు.

బీజేపీ నేతలపై కూడా రేవంత్ రెడ్డి ధాటిగా స్పందించారు. “బీజేపీ అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వదని పిర్యాదు చేశారు. కానీ సోనియా గాంధీ ఆదేశాలతో అజారుద్దీన్‌ను మంత్రిని చేశాం. గుజరాత్‌లో చేయలేదు కానీ తెలంగాణలో చేశాం. నీకేం ఇబ్బంది కిషన్ రెడ్డి?” అని ప్రశ్నించారు. “బీఆర్‌ఎస్ వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారు? బీఆర్‌ఎస్, బీజేపీ ఇద్దరూ ఒక్కటే. కాళేశ్వరం ATM అన్నారు మోదీ, అమిత్‌ షాలు. సరే, దొంగను పట్టుకోండి అని సీబీఐ విచారణకు ఇచ్చాం. మూడు నెలలు అయినా ఇప్పటివరకు FIR నమోదు చేయలేదు. ఎందుకు? ఎందుకంటే బీజేపీకి కేసీఆర్‌పై మద్దతు ఉంది,” అని సీఎం రేవంత్‌ విమర్శించారు.

“కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్‌కు గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసాం. కానీ గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. కిషన్ రెడ్డి కేసీఆర్‌కి లొంగిపోకపోతే, సీబీఐ విచారణ మొదలుపెట్టాలి. 11వ తేదీ లోపు కేసీఆర్‌, హరీష్‌లను అరెస్ట్ చేయాలి. బీజేపీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో విలీనం అవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను కాదు, కేసీఆర్ బిడ్డనే చెప్పింది,” అని సీఎం రేవంత్‌ ధ్వజమెత్తారు. “ఒక్కసారి నవీన్‌ యాదవ్‌కి అవకాశం ఇవ్వండి. జూబ్లీహిల్స్‌ ముఖచిత్రం మార్చేస్తా. మీకు అండగా ఉంటా. 30 వేల మెజార్టీతో కాంగ్రెస్‌ జెండా ఎగరనిద్దాం,” అని పిలుపునిచ్చారు.

Minister Nara Lokesh: వైఎస్‌ జగన్‌ పర్యటనపై మంత్రి లోకేష్‌ సెటైర్లు.. అప్పుడప్పుడు ఏపీకి వచ్చి మాపై విమర్శలా..?

Exit mobile version