Minister Nara Lokesh: మొంథా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కూటమి సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు.. అయితే, అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే జగన్.. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు.. కానీ, మీ వైపు చూపే నాలుగు వేళ్లు ఉన్నాయని మాత్రం మర్చిపోతున్నారు, అని మంత్రి నారా లోకేష్ విమర్శించారు.
మొంథా తుఫాను హెచ్చరిక వచ్చినప్పటి నుండి సాధారణ పరిస్థితులు నెలకొనే దాకా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి ఎమ్మెల్యే వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అందరూ ప్రజల మధ్యే ఉన్నామని, ప్రజలను ఆదుకున్నామని తెలిపారు మంత్రి లోకేష్.. ఈ విషయాలు మీకు తెలియవు జగన్.. ఎందుకంటే మీరు ఇక్కడ లేరు.. మీది వేరే భ్రమాలోకం.. అందులో విహరిస్తుంటే, ప్రజల పరిస్థితి ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. ఇక, మహిళల పట్ల గౌరవం, దేశం పట్ల భక్తి తనలో ఉన్నాయని పేర్కొన్న లోకేష్, అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లాను. కోట్లాది భారతీయులు గర్వపడేలా మహిళా మణులు వరల్డ్ కప్ గెలవడం నాకు స్వంత విజయం లాగా అనిపించింది అన్నారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి విలువ ఏమిటో ఎలా తెలుస్తుంది? అంటూ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు.