CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే

  • పాలమూరు ప్రాజెక్టులపై కేసీఆర్‌ను నిలదీసిన సీఎం
  • రూ.8 వేల కోట్లతో జిల్లాలో అభివృద్ధి పనులు: రేవంత్
  • పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సవాల్
  • 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారం.. 'ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్' నినాదం
Cm Revanth Reddy Kcr

Cm Revanth Reddy Kcr

CM Revanth Reddy : జడ్చర్లలో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డగా గత రెండు రోజులుగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించానని తెలిపిన ఆయన, వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు అనుభవించిన ఈ గడ్డపై గతంలో కేసీఆర్‌కు ఇక్కడ ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా రాజకీయ వలస వచ్చాడని, అయినప్పటికీ ఇక్కడి ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని గుర్తుచేశారు. ఒక తల్లిగా ఇక ఏ తల్లికి గుండెకోత ఉండొద్దనే ఉద్దేశంతోనే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, కానీ కేసీఆర్ మేకవన్నె పులి అని గుర్తించక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రెండుసార్లు ఆయన చేతిలో పెడితే.. పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని సీఎం మండిపడ్డారు.

పాలమూరులో గెలిపించినందుకు ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పారిపోయి గజ్వేల్‌లో పోటీ చేసిన కేసీఆర్ పాలమూరు ద్రోహినా? లేక ఇక్కడే పుట్టి పెరిగిన నేను ద్రోహినా? అని నిలదీశారు. పదేళ్లలో కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్, ఉద్దండపూర్ మునిగిపోతుంటే నిర్వాసితుల కోసం రూ. 800 కోట్లు ఇవ్వలేదని, పైగా న్యాయం అడిగిన నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే “మట్టికి పోయినా మనోడే పోవాలి” అని పెద్దలు చెప్పారని, మీ పాలమూరు బిడ్డగా కేవలం ఈ 30 నెలల కాలంలోనే జిల్లా ప్రాజెక్టుల కోసం రూ. 8 వేల కోట్లు ఖర్చు చేశానని సీఎం వెల్లడించారు. బిఆర్ఎస్ నాయకులు జైళ్లు కట్టాలని చూస్తే.. తాము పేద పిల్లల కోసం స్కూళ్లు కట్టాలని అనుకున్నామని, జిల్లాలో వలసలు ఆగి బతుకులు బాగుపడాలంటే చదువొక్కటే మార్గమని నమ్మి కొడంగల్‌లో భారీ ఎడ్యుకేషన్ హబ్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

×
×
Ad

ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందని విమర్శిస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి లెక్కలతో సమాధానమిస్తూ.. తమ రెండున్నరేళ్ల పాలనలో 15 లక్షల కొత్త రేషన్ కార్డులు అందించామని, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, అలాగే మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. తాము చేసిన అభివృద్ధిని చెప్పాలంటే రాస్తే రామాయణం, చెబితే భారతమంత ఉందని, ఈ క్రమంలోనే కేసీఆర్‌కు సవాల్ విసురుతూ.. “నీ పదేళ్ల పాలనపై, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం.. నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రా, చర్చలో మాది తప్పని తేలితే నేను క్షమాపణ చెబుతా” అని సవాల్ విసిరారు. నిన్నమొన్నటి వరకు దొంగలకు సద్దులు మోసిన వాళ్లు ఇప్పుడు పాదయాత్రలు చేస్తామని మాట్లాడుతున్నారని, వారు పాదయాత్ర కాదు కాశీ దాకా పొర్లుదండాలు పెట్టినా చేసిన పాపాలు తొలిగిపోవని విమర్శించారు.

పంచె కట్టుకుని ఇప్పుడు ఊళ్లలోకి వస్తే ప్రజలు ఉరికించి కొడతారన్న సీఎం, కేసీఆర్ రాసిపెట్టుకో.. పాలమూరు ప్రజలకు మట్టి తీసుడే కాదు, మట్టితో కప్పడం కూడా తెలుసని, రాబోయే రోజుల్లో పాలమూరు జిల్లాలో మీ పార్టీని బొంద పెడతాం, మీ వాళ్లని ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలవనివ్వం అని హెచ్చరించారు. అలాగే గోదావరి జలాలపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడుమూతలాడుతున్నారని, బీజేపీ నాయకులు ఇక్కడ తప్పించుకు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎన్ని డ్రామాలూ ఆడినా తుమ్మిడిహెట్టి కట్టి తీరుతామని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని ఒప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేస్తూ, జిల్లా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీదే అధికారమని, 2029లో మళ్లీ కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో అధికారంలోకి తెస్తామని చెప్తూ, “ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్” అనే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ముగించారు.