CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!

  • కాళేశ్వరంపై జాయింట్ సెషన్‌కు ఆహ్వానం
  • కేసీఆర్ కుటుంబంపై సీఎం విమర్శలు
  • ప్రాజెక్టు మరమ్మతులపై కీలక వ్యాఖ్యలు
  • ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వ హామీ
Revanth Reddy Kcr

Revanth Reddy Kcr

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి నెవ్వెర్ బిఫోర్ అనదగ్గ రీతిలో బహిరంగ సవాల్ విసిరారు. కేసీఆర్ కోరుకున్న రోజున అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్పీకర్‌కు లేఖ రాసి ఆయనే స్వయంగా ఒక తేదీని ఖరారు చేయాలని, ఇరు సభల జాయింట్ సెషన్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దామని పిలుపునిచ్చారు. సభలో కేసీఆర్ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా, చర్చ సజావుగా సాగేలా చూసుకునే పూర్తి బాధ్యత తమదేనని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు రిపేర్ల బాధ్యతను ఎందుకు ఆయనకే అప్పగించాలో సభలో చెబితే, రాబోయే మూడేళ్ల పాటు కాళేశ్వరం మరమ్మతుల బాధ్యతలను కేసీఆర్‌కే అప్పగిస్తామని సీఎం స్పష్టం చేశారు.

కుటుంబం వేల కోట్లకు ఎలా ఎదిగింది? ఆ సీక్రెట్ చెప్పండి

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై గత ప్రభుత్వ తీరును రేవంత్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. “సాధారణంగా బాంబులు పెడితే పైకి పేలాలి.. కానీ ప్రాజెక్టు కిందకు కుంగిపోతుందా?” అంటూ ఎద్దేవా చేశారు. ఇంత జరిగినా సిగ్గులేకుండా తమపైనే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో కేవలం ఒక్కొక్కరిని కాకుండా, రాష్ట్రానికి నష్టం చేసిన ఆ కుటుంబాన్ని మొత్తంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే.. మరోవైపు ఆ కుటుంబం మాత్రం వేల కోట్లకు ఎలా ఎదిగిందో, ఆ సీక్రెట్ ఏదో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి ప్రజలకు చెబితే బాగుంటుందని హితవు పలికారు. ఆయన ఇచ్చే ప్రసంగం, సలహాలు ప్రజలకు ఉపయోగపడితే కచ్చితంగా వాడుకుంటామన్నారు.

ఒకటో తేదీనే జీతాలు.. పనులపై సెల్ఫీలా

గత ప్రభుత్వ హయాంలో నెలాఖరు వరకు జీతాల కోసం ఉద్యోగులు ఎదురుచూడాల్సి వచ్చేదని, కానీ తమ ప్రజా ప్రభుత్వంలో ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని సీఎం గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వాళ్లకు కూడా ఒకటో తేదీనే జీతం వేసి చూపించామన్నారు. తాము టిమ్స్ (TIMS) ఆసుపత్రుల నిర్మాణాలకు కొబ్బరికాయలు కొట్టి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష నేతలు మాత్రం అక్కడికి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు ఇన్సూరెన్స్ అందిస్తున్నామని, క్వాలిటీ, ప్రజల సంక్షేమం విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.