CM KCR Wishes Raksha Bandhan To Telangana People: మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతంచేసే రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ అక్కాచెల్లెళ్లకు అన్నాతమ్ముళ్లు ఎల్లవేళలా అండగా నిలబడుతారనే భరోసాభావన రాఖీ పండుగలో ఇమిడి ఉందని అన్నారు. సోదరభావంతో, ప్రేమానురాగాలతో ప్రతి ఏటా శ్రావణమాసం పౌర్ణమి నాడు ఈ రాఖీ పండుగ జరుపుకుంటామన్నారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమిదని పేర్కొన్నారు. ఈ వేడుకల సందర్భంగా .. దేశ ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
మరోవైపు.. పెన్షన్లు ఇవ్వడం లేదని బీజేపీ చేస్తోన్న ఆరోపణలకు మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలోనే పెన్షన్లు పది రెట్లు పెరిగాయన్నారు. ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు పెన్షన్లు ఇస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడంతో పాటు 13.30 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చామన్నారు. ఇదే సమయంలో అనవసర సిజేరియన్లు తగ్గించి, సహజ ప్రసవాలను పెంచాలని కోరారు. సహజ ప్రసవం చేయించే వైద్య సిబ్బందికి రూ.3 వేల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల్లో కేంద్రం కోటా తగ్గించిందని ఆగ్రహించారు. మిషన్ భగీరథ వల్ల మంచినీళ్లతో ఫ్లోరోసిస్ మహమ్మారిని తరిమికొట్టామని.. అయితే ఇప్పుడు ‘హర్ ఘర్ జల్’ పేరుతో కేంద్రం ఏదో ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.