ఇవాళ (మే 18) ప్రగతి భవన్‌కు వచ్చిన తిమ్మక్కను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘనంగా సన్మానించారు. “వృక్షమాత” తిమ్మక్క తెలంగాణ ప్రజలందరికి స్పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. మొక్కలు నాటడమంటే కార్యక్రమం కాదని.. మనల్ని, మన భవిష్యత్ తరాలను బ్రతికించే మార్గమని అన్నారు. ఆ బాధ్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని.. తిమ్మక్క మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
అనంతరం తిమ్మక్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన “హరిత హారం” ప్రకృతికి మేలు చేస్తుందన్నారు. స్వయంగా ప్రభుత్వమే చెట్లు నాటే కార్యక్రమానికి పూనుకోవడం.. నిబద్ధతగా ప్రతియేటా మొక్కలు నాటడం, రక్షించడం లాంటి కార్యక్రమాలు కేసిఆర్‌కి ప్రకృతిపై ఉన్న బాధ్యాతయుతమైన ఆలోచనకు తార్కాణమన్నారు. హరితహారంలో పండ్ల మొక్కలను నాటితే.. మనుషులకే కాకుండా జంతువులకూ మేలు చేసినవారవుతారని చెప్పారు. అవసరమైతే, తాను పెంచిన పండ్ల మొక్కలను కూడా పంపుతానన్నారు. తిమ్మక్క నిస్వార్ధతకు ముగ్ధుడైన కేసిఆర్.. మంచి వారికి మంచి జరుగుతుందని చెప్పేందుకు తిమ్మక్కే నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.