”దళిత బంధు పథకం’’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకోవాలని…’దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదు ఉద్యమం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గం గా అభివృద్ది చెందాలని.. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పుకోసం వచ్చే దిశగా దళితుల ఆర్థిక సాధికారత సాధించాలని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అమలులోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం కృషి చేస్తుందని…విద్యావంతులైన దళిత సమాజం కదలిరావాలని పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న తెలంగాణ దళిత బంధు పథకాన్ని విజయవంతం చేయడం కోసం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు పట్టుపట్టి పనిచేయాలన్నారు. తద్వారా తెలంగాణతో పాటు దేశ దళిత సమాజంలో అభివృద్ధి వెలుగులు ప్రసరింప చేసేందుకు దోహదపడాలన్నారు. దళితులను ఆర్థిక వివక్షనుంచే కాకుండా సామాజిక వివక్షనుంచి దూరంచేసి వారి ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టేందుకే తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని సిఎం పునరుద్ఘాటించారు.