హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ చేరిందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు మరో పదిరోజుల సమయం ఉండగా ప్రచారం మాత్రం 72గంటల ముందే ముగించాలని ఈసీ ఆదేశించింది. అంటే ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉందనే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా హుజూరాబాద్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా సాగుతున్న ప్రచారంలోకి ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఓటర్లంతా ఎవరి వైపు ఆకర్షితులు అవుతారనేది ఆసక్తిని రేపుతోంది.
హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. రేవంత్ రెడ్డి టీపీసీసీగా నియామకం కావడంతో కాంగ్రెస్ రేసులో ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో చేసిన ఆలస్యం ఆపార్టీకి మైనస్ గా మారింది. చాలా తక్కువ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నియోజకవర్గాన్ని చుట్టిరావడం సమస్యగా మారింది. అంతే కాకుండా ఆయన స్థానికేతరుడు కావడం కూడా కాంగ్రెస్ పార్టీని రేసులో వెనుకబడేసినట్లు కన్పిస్తోంది. దీంతో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యననే స్పష్టమవుతుంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా సీన్ మారిపోవడంతో ఓటర్లు ఈ రెండు పార్టీల ప్రచారాన్ని నిషితంగా గమనిస్తున్నారు.
ప్రచారంలో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ప్రచారం ముగింపునకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు తమ శక్తిమేర అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రధానం కేంద్ర వైఫల్యాలపై ఫోకస్ పెడుతోంది. పెట్రోల్, డిజీల్, వంటగ్యాస్ పెరుగుదల, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణపై విమర్శలు గుప్పిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, ఉచిత కరెంట్, దళితబంధు వంటి పథకాలను ఎక్కువగా ప్రచారం చేస్తోంది. ఈటల రాజేందర్ స్వార్థంతోనే ఉప ఎన్నిక వచ్చిందంటూనే బీజేపీ విధానాలను టీఆర్ఎస్ నేతలు తూర్పార పడుతున్నారు.
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తుండటతో బీజేపీ డిఫెన్స్ లో పడుతోంది. ఈనేపథ్యంలోనే కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేలా ప్లాన్ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లారు. ఓ డజను మందిని రప్పించి టీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇప్పించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఈనెల 21 నుంచి కేంద్ర మంత్రులు హుజూరాబాద్ లో ప్రచారం చేసే అవకాశం కన్పిస్తోంది. కేంద్రంపై ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పికొట్టాలని భావిస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఉప ఎన్నిక ప్రచారం చూస్తుంటే మాత్రం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ లకు సవాలుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.