Devendra Fadnavis: కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో కుటుంబ పాలన ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. తెలంగాణను బీఆర్ఎస్ లూటీ చేసిందని మంగళవారం దుయ్యబట్టారు. ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఫడ్నవీస్ ఆరోపించారు. అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని, తెలంగాణలో అంత అవినీతి జరిగిందని ఎగతాళి చేశారు.
గత తొమ్మిదేళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారని, మొదట టీఆర్ఎస్ అని, ఇప్పుడు బీఆర్ఎస్ అని మారిందని, అయితే దీనికి బదులు ‘ఎఫ్ఆర్ఎస్’ అని ‘ఫ్యామిలీ రాజ్ సమితి’ అని పేరు పెట్టుకుంటే బాగుండేదని సెటైర్లు వేశారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా దళితుడిని నియమిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, రాష్ట్రంలో దళితులకు అందాల్సిన సంక్షేమ పథకాల్లో బీఆర్ఎస్ పాలన అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామనే హామీని విస్మరించారని ఆరోపించారు.
Read Also: North Korea: సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా.. రష్యా సాయం.?
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నదీ జలాలను విడుదల చేయాలని కోరారని, పక్క రాష్ట్రం తెలంగాణకు నీటిని విడుదల చేశామని, అయితే ఈ నీటిని వ్యవసాయానికి కాకుండా అవినీతికి వాడుకుంటాడని నాకు అప్పుడు తెలియదని ఆరోపించారు. బీఆర్ఎస్ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని, కేసీఆర్ తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రకటనల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాడని ఆరోపించారు.
‘‘కేసీఆర్ సాబ్, మహారాష్ట్ర రావాలనే కలను కనడం మానేయండి.. తెలంగాణలో బీజేపీ మిమ్మల్ని ప్యాక్ చేయబోతోంది’’ అంటూ ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలనీ, వాటిపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని, మోడీ ఎలాంటి హామీలు ఇచ్చినా.. నెరవేరుస్తారని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణలో పోటీ చేస్తున్న కొందరు కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నాడని, ఇప్పటికే అలాంటి కొనుగోలు, అమ్మకాలు జరిగాయని ఫడ్నవీస్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఉండాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.