బీజేపీ అధిష్టానం తెలంగాణ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. వచ్చే నెలలో జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని ఇందుకు అనుకూలంగా మార్చుకోనున్నాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ లోపే మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఎందుకు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా వివరించాలని హైకమాండ్ ఆదేశించింది. సమావేశాల గురించి ప్రతీ బూత్ స్థాయిలో తెలిసే విధంగా చేయాలని.. పార్టీ తెలంగాణలో అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తుందనే వాతావరణం రావాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. మోదీ వచ్చిన రోజు దారి వెంట ఘన స్వాగతం ఏర్పాట్లు.. బేగంపేట నుంచి రాజ్ భవన్, రాజ్ భవన్ నుంచి హైటెక్స్ వరకు రోడ్లపై ప్రజలతో స్వాగత కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. వివిధ రాష్ట్రాల నుంచి సీఎంలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న ఆయా రాష్ట్రాల ప్రజలతో ప్రత్యేక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కార్యవర్గ సమావేశానికి ఒక రోజు ముందే జేపీ నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రానున్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో కార్యచరణ ప్రారంభిస్తున్నారు. బీజేపీ పూర్తి అధిష్టానం తెలంగాణలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడంతో బీజేపీ తెలంగాణ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పకనే చెబుతోంది. వరసగా ఇటీవల బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ముగింపు కార్యక్రమానికి అమిత్ షా కూడా వచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇక్కడి వచ్చిన ప్రధాని మోదీ కూడా కేసీఆర్ కుటుంబ పాలనపై విరుచుకుపడ్డారు. క్రమంగా వివిధ రాష్ట్రాల ముఖ్యనాయకులు, కేందమంత్రులు తెలంగాణకు వస్తూ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ఎంత ముఖ్యమో చెబుతున్నారు.