టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉద్యమకారులు ఎవ్వరు లేరు. అక్కడ ఉన్న వాళ్లంతా తెలంగాణ ద్రోహులే అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. హుజురాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ… సొంత పార్టీ నేతలే కొనుగోలు చేస్తున్న దుస్థితి ఇప్పుడు హుజురాబాద్ లో కొనసాగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కమిషన్లతో ఉప ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు. నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈటల రాజేందర్ విజయం ఖాయం. మంత్రులంతా హుజరాబాద్ లో తిష్ట వేసి 40 కోట్లు ఇస్తాం, 50 కోట్లు ఇస్తాం అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హుజరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు అభ్యర్థులు దొరకడంలేదు. నాయకులను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే హుజరాబాద్ లో 70 కోట్లు ఖర్చు చేశారు అని తెలిపారు. డబ్బు, అధికారం ఉందని అహంకారంతో వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇక పెద్దపెల్లి ఎంపీగా మా నాన్న వెంకటస్వామి ఉన్నప్పుడు హుజరాబాద్ కూడా అదే నియోజకవర్గంలో ఉండేది. బీజేపీలో చేరిన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన ఈటల రాజేందర్ కు ప్రజల ఘనస్వాగతం చూసిన తర్వాత వాళ్లకు ఆయన ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. ఈటల రాజేందర్ ను బీజేపీ లోకి తీసుకువచ్చి మంచి పని చేసావని చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్లు కూడా వీటిలో ఓటు వేస్తామని చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి వేల కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ సంగమేశ్వరం ప్రాజెక్టు కట్టి నీటిని దోచుకెళ్లేందుకు ప్రయత్నిస్తుందని గతంలో ఎంత మొత్తుకున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల రాగానే నీటి దోపిడీ గురించి మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు.