NTV Telugu Site icon

జోరుమీదున్న కారు, కాషాయం.. కానీ కాంగ్రెస్..?

ఈ నెల 30న హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హుజురాబాద్‌ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వాటి ప్రచారాల్లో దూకుడు పెంచాయి. ఉప ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త వ్యూహ్యాలను ఎంచుకుంటున్నారు. ప్రచారంలో తమ దైన శైలితో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ సర్వే సంస్థలు కూడా హుజురాబాద్ గెలుపెవరిదో తెలియక తికమక అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. రాజకీయ పార్టీల ప్రచారం ఏ విధంగా సాగుతుందో అని. ఈ ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు.

అయితే టీఆర్‌ఎస్‌ తరుఫున గెల్లు శ్రీనివాస్‌, బీజేపీ తరుఫున ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ లు పోటీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. 2009 నుంచి హుజురాబాద్‌ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఈటల రాజేందర్‌ భూకబ్జా ఆరోపణలతో టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవికీ, టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిననాటి నుంచి ఈటల రాజేందర్.. తన నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు.

Also Read : ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి : బండి సంజయ్

ఆయన గెలుపు కోసం బీజేపీ శ్రేణులు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. వీరితో పాటు ఈటల సతీమణి జమున కూడా ప్రచారంలో చురుకుగా పాల్గొంటూ ఈటల గెలుపుకోసం పాటుపడుతున్నారు. మరో వైపేమో గత నాలుగు పర్యాయాలుగా హుజురాబాద్‌లో ఈటల గెలుపుతో ఎగిరిన టీఆర్‌ఎస్‌ జెండాను.. ఈ సారి కూడా ఎలాగైనా హుజురాబాద్ గడ్డమీద ఎగరవేయాలని కేసీఆర్‌ నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో హుజురాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫకేషన్‌కు ముందే హుజురాబాద్‌ ప్రజలపై వరాలు కురిపించారు.

దీంతో పాటు మంత్రి హరీశ్‌రావు కూడా హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసేందుకు అహర్నిశలు కష్టపడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందునుండే బీజేపీ అభ్యర్థి గా ఈటల ప్రచారం నిర్వహించినా.. టీఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున ఎవరు రంగంలోకి దిగుతారనే ప్రశ్న నియోజకవర్గ ప్రజల్లోనే కాదు.. యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. అప్పుడు విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనువాస్ యాదవ్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం నిర్వహిస్తోంది.

కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఆలస్యంగా తమ అభ్యర్థిని ప్రకటించింది. రోజురోజుకు హుజురాబాద్‌ ప్రచారంలో కారు, కాషాయం జోరు పెంచుకుంటూ పోతున్నా.. కాంగ్రెస్‌ పార్టీ తరుఫున ప్రచారం మాత్రం అంతగా కనిపించడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఉదయం నుంచి బీజేపీ, టీఆర్‌ఎస్‌లలోని ప్రముఖులు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాత్రం అనుభవజ్ఞులు ప్రచారం నిర్వహించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిన్న, మొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించినా.. అంతగా ప్రచారం నిర్వహించలేదు. మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై గర్జించారు. ఆయన నిర్వహించిన సమావేశాలు కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ కు ఎంత వరకు ఫలితానిస్తుందో చూడాలి మరి..