ఒక కిడ్నాప్ వంద ప్రశ్నలు రేకెత్తిస్తోంది. హైదరాబాద్ శివారు ఆదిభట్లలో జరిగిన కిడ్నాప్ యావత్ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిందనే చెప్పాలి. డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ఎన్నో మలుపులు.. ఆదిభట్ల పీఎస్ నుండి 32 మందిని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అరెస్టు చేసిన వారిలో కొంతమంది కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ వారిని అనవసరంగా అరెస్టు చేశారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు… తమ పిల్లల్ని కనీసం మాట్లాడించడానికి కూడా అవకాశం ఇవ్వడంలేదంటున్నారు కుటుంబ సభ్యులు. ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితులందరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నారు పోలీసులు.
నిందితులకు వైద్యపరీక్షలు
రంగారెడ్డి జిల్లా ఆధిభట్ల పరిధిలోని మన్నెగూడలో జరిగిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సూమారు 100 మంది అనుచరులతో వచ్చిన మిస్టర్ టీ షాప్ ఓనర్ నవీన్ రెడ్డి.. వైశాలి ఇంటిపై, కుటుంబ సభ్యులపై దాడి చేసి ఆమెను తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వైశాలి ఇంటి పై దాడి సమయంలో వచ్చిన వారిలో ఎక్కువ మంది టీ షాప్ లో పనిచేసే వారు కాగా, మరికొంతమంది నవీన్ రెడ్డి ఫ్రెండ్స్ గా పోలీపులు గుర్తించారు. ఇప్పటి వరకు 31 మందిని అదుపులోకి తీసుకుని.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో భాగంగా నవీన్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.
ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు
డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసినప్పటి నుంచి ఈ కేసులు ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల తర్వాత , వైశాలి తన తల్లి దండ్రులకు ఫోన్ చేయడంతో అసలు ట్విస్ట్ నెలకొంది. తాను సేఫ్ గా ఉన్నానని.. ఆందోళన చెంద వద్దని చెప్పింది. వైశాలి కాల్ ఆధారంగా సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆమెను ట్రేస్ చేశారు. యువతి నల్గొండలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు. యువతి తండ్రితో పాటు అక్కడికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి వైశాలిని కాపాడారు. కాగా, ప్రస్తుతం నవీన్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. గతేడాది ఆగష్టులో వైశాలితో తనకు వివాహం జరిగిందని.. బీడీఎస్ కంప్లీట్ అయ్యే వరకు ఫొటోలు బయటకు పెట్టకూడదని వైశాలి కండీషన్ పెట్టడంతోనే పెళ్లి ఫొటోలు బయటకు రాలేదని నవీన్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. తాము ప్రేమించుకున్నట్టు వైశాలి తల్లి దండ్రులకు తెలుసని.. బీడీఎస్ పూర్తి అయ్యాక పెళ్లి చేస్తామని వారు చెప్పినట్టు నవీన్ వెల్లడించాడు. పెళ్లి పేరుతో తనతో చాలా ఖర్చు పెట్టించారని.. గోవా, అరకు సహా పలు ప్రాంతాలకు తన డబ్బుతోనే వెళ్లారని చెప్పినట్టు సమాచారం. అయితే నవీన్ చెప్పినవి నిజమా.. కాదా?అని తెలియాల్సి ఉంది.
ఎవరి వాదన వారిదే..
అయితే వైశాలికి , నవీన్ కు ఎటువంటి సంబంధం లేదని యువతి తల్లి దండ్రులు చెబుతున్నారు. వైశాలి బయటకు వెళ్లినప్పుడల్లా.. నవీన్ ఇబ్బంది పెట్టేవాడని.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. అయినా పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే నవీన్ రెడ్డి కుటుంబసభ్యులు మాత్రం మరో వాదనను వినిపిస్తున్నారు. నవీన్, వైశాలి ప్రేమించుకున్నారని.. గతంలో తమ ఇంటికి వైశాలి వచ్చినట్టు నవీన్ తల్లి తెలిపారు. తమ కొడుకును ఆర్థికంగా వాడుకున్నారన్నారు.పెళ్లి కూడా చేసుకున్నారని, భార్యాభర్తల్లా బయట తిరిగారని.. ఇప్పుడు నవీన్ ను మోసం చేశారను ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వాదనలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. నిజానిజాలపై కూపీ లాగుతున్నారు.