Site icon NTV Telugu

Bhatti Vikramarka : ప్రజల పక్షాన నిలబడేదే ప్రజాస్వామ్యం.. బీఆర్‌ఎస్ తీరుపై భట్టి ఫైర్..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

తెలంగాణ శాసనసభలో బడ్జెట్ క్లారిఫికేషన్ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను, ఉద్యోగులను నిర్బంధించిన వారు.. ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వినే ఓపిక లేక సభ నుంచి వెళ్ళిపోవడం వారి అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

“గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న నాకు జరిగిన అవమానాలు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. ప్రజల సమస్యల కోసం మైక్ అడిగితే ఇవ్వని వారు, నేడు మేము ప్రతి అంశానికి సమాధానం ఇస్తామన్నా వినకుండా పారిపోతున్నారు” అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, తమ ఆలోచనలన్నీ ప్రజల అవసరాల చుట్టూనే తిరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని భట్టి తెలిపారు. ఏదైనా కారణంతో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకూడదన్న ఉద్దేశంతో రూ. 1.20 కోట్ల ప్రమాద భీమా కల్పించామని, దీనివల్ల 7.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. గతంలో ఉద్యోగులను హౌస్ అరెస్టులు చేసి, భయం భయంగా బతికించిన బీఆర్‌ఎస్ నేతలకు ఈ సంక్షేమం ఇష్టం లేకే సభను వీడారని విమర్శించారు.

IPL vs PSL: ఇది కదా ఐపీఎల్ సత్తా.. వణికిపోతున్న పీఎస్ఎల్..

పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో బడికి రావద్దన్న ఆలోచనతో పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావ అందించాలని నిర్ణయించామన్నారు. అంతేకాకుండా, ఇంటర్ విద్యార్థులకు కూడా మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఈ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షం బడ్జెట్ కాగితాలు చించి చెవిలో పెట్టుకుని వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు.

వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెబుతూ, ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ. 14 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని, గత ప్రభుత్వంలాగా ఓట్ల కోసం ఔటర్ రింగ్ రోడ్డును కుదువబెట్టి డబ్బులు పంచే సంస్కృతి తమది కాదని హితవు పలికారు. సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు.

మత, ప్రాంత భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల ప్రమాద భీమా కల్పించామని, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాల కోసం రూ. 50 వేల కోట్లు కేటాయించామని భట్టి విక్రమార్క వివరించారు. వ్యక్తులుగా తాము చిన్నవాళ్ళం కావచ్చు కానీ, తాము చేపట్టిన ప్రజాస్వామ్య ప్రక్రియను మన్నించి చర్చలో పాల్గొనాల్సింది పోయి, ‘ఆడలేక మధ్యలో ఓడు’ అన్నట్టుగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఆయన ప్రసంగాన్ని ముగించారు.

Exit mobile version