దక్షిణ అయోద్యగా వర్థిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే టిక్కెట్ల విక్రయాలను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టిక్కెట్ల విక్రయాలన్నింటిని ఆన్ లైన్ లో పెట్టామని చేతులు దులుపుకుంటున్నారు దేవస్థానం అధికారులు. ఏ దేవాలయంలో లేని ప్రత్యేకత భద్రాద్రి దేవాలయానికి శ్రీరామ నవమికి ఉంటుంది. శ్రీరామ నవమి నాడు శ్రీ
సీతారాముల కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుందో దేశ వ్యాపితంగా అదే సమయంలో జరగడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతుంది. దీనికి పెద్ద
ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గోటి తలంబ్రాలను ఎక్కువ మంది భక్తులు తీసుకుని వస్తారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సైతం భక్తులు భద్రాచలంకు వచ్చి స్వామి వారి కళ్యాణాన్ని తిలకించడం జరుగుతుంది. కరోనా వల్ల గత రెండు సంవత్సరాల నుంచి శ్రీరామ నవమి వేడుకలు జరుగలేదు. ప్రతి యేటా మిథిలా మండపంలో సీతారాముల కళ్యాణం అత్యంత రమణీయంగా జరుగుతుంటుంది. అయితే కరోనా వల్ల రెండు సంవత్సరాల నుంచి భక్తులు లేకుండానే అర్చకులు, వేద పండితులు మాత్రమే కళ్యాణాన్ని నిర్వహించారు. అయితే ఈసారి కళ్యాణం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఆశిస్తున్నారు. అయితే ఆన్ లైన్ లో విక్రయాలను మాత్రమే ఇప్పటి వరకు భద్రాచలం దేవస్థానం చేపట్టింది. ఆన్ లైన్ లో 14వేల టిక్కెట్ల విక్రయాలకు పెట్టారు. మార్చి నెల మొదటి వారంలో ఈ విక్రయాలను పెట్టినప్పటికి ఇప్పటి వరకు రెండు వేల టిక్కెట్లు మాత్రమే విక్రయించడం జరిగింది. నెల రోజులుగా ఆన్ లైన్ లో విక్రయాలు పెడితే కేవలం రెండు వేలు మాత్రమే విక్రయాలు జరిగాయి.
భద్రాచలంలో టికెట్ విక్రయాల కోసం కౌంటర్ లను ఏర్పాటు చేయలేదు. భద్రాచలంలో లక్షలాది రూపాయలను వెచ్చించి శ్రీరామ నవమి ఏర్పాట్ల ఉత్సవాలను చేస్తున్నారు. పట్టణం మొత్తం విద్యుత్ దీపాలతో కళ కళ లాడే విధంగా చేస్తున్నారు. స్వాగత ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే రెండేళ్ల తరువాత దేవస్థానం మిథిలా స్టేడియంలో భక్తుల సమక్షంలో శ్రీసీతారాముల కళ్యాణాన్నినిర్వహిస్తున్నప్పటికి టిక్కెట్ల విక్రయాలపై దృష్టి పెట్టడం లేదు.
టిక్కెట్ల విక్రయాల కౌంటర్ లు పెడితే మంచి ఆదాయం వచ్చేదని అంటున్నారు. శ్రీరామ నవమి విక్రయాలకు సంబంధించి ఎప్పుడో డిసైడ్ అయినప్పటికి ఇప్పటి వరకు విక్రయాల కోసం ఏర్పాట్లను మాత్రం చేయలేదు. ఈ టిక్కెట్ల విక్రయాల వల్ల ప్రతి యేడాది 1.3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈసారి టిక్కెట్ల విక్రయాల రేట్లను పెంచారు. దీని వల్ల రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
మరోవైపున టిక్కెట్ల విక్రయాలకు ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయలేని దేవస్థానం.. టిక్కెట్ల రేట్లను మాత్రం భారీగా పెంచడం విమర్శలకు తావిస్తోంది. వంద రూపాయల టిక్కెట్ల వద్ద నుంచి అయిదు వేల రూపాయల ఉభయ దాతల టిక్కెట్ల నుంచి అన్నిరేట్లను ఇష్టం వచ్చినట్లుగా పెంచేశారు. వంద రూపాయల టిక్కెట్ 150రూపాయలకు పెంచారు. అదేవిధంగా ఇప్పుడు టిక్కెట్లు అన్ని 150, 300, 1000, 2000, 2,500, 7,500 రూపాయల టిక్కెట్లు ఇప్పుడు అందుబాటులో భక్తుల కోసం ఉన్నాయి. రేట్లను పెంచడంతో దేవస్థానంకు మరింత ఆదాయం వస్తుందని భావించినా, దానికి అనుగుణంగా మాత్రం ఏర్పాట్లను చేయక పోవడం విమర్శలకు తావిస్తోంది.