Site icon NTV Telugu

Telangana: బీజేపీ ఉంది.. బీ కేర్‌ఫుల్‌..!

Bjp Congress

Bjp Congress

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రెండు పొలిటికల్‌ పార్టీలు మాత్రమే ఉండేవి. ఒకటి.. కాంగ్రెస్‌. రెండు.. తెలుగుదేశం. కాబట్టి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేవి. ఒక పార్టీ మహాఅయితే వరుసగా రెండు సార్లు మాత్రమే గెలిచేది. అందువల్ల పదేళ్ల తర్వాత మరో పార్టీకి ఛాన్స్‌ వచ్చేది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో స్వేచ్ఛగా ఒకరినొకరు విమర్శించుకునేవారు. హస్తం పార్టీలో ఎప్పుడూ రెండు, మూడు గ్రూపులు ఉండేవి. ఒకటి.. అధిష్టానం గ్రూపు. రెండు.. లోకల్‌ గ్రూపు.

మళ్లీ ఆ లోకల్‌ గ్రూపులో కూడా వర్గాలు ఉండేవి. వాటిలో బలమైనది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్గం. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు పీజేఆర్‌, వీహెచ్‌, మర్రి శశిధర్‌రెడ్డి, ఎంఎస్‌ఆర్‌, శంకర్‌రావు, ఉప్పునూతల తదితరులు అసమ్మతి గ్రూపులా వ్యవహరించేవాళ్లు. ఒకరకంగా చెప్పాలంటే పార్టీలో క్రమశిక్షణ ఉండేది కాదు. అది వైఎస్‌ చనిపోయాక పీక్‌ స్టేజ్‌కి చేరింది. జగన్నామస్మరణ మొదలైంది. ఈలోపు టీడీపీ నుంచి కేసీఆర్‌ బయటికి వచ్చి తెలంగాణకు ప్రతినిధిలా, స్ట్రాంగ్‌ లీడర్‌లా ఎస్టాబ్లిష్‌ అవుతున్నారు.

జగన్‌ని సీఎం కాకుండా అడ్డుకోవటంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. కానీ అది ఏకంగా ఏపీ విభజనకు దారితీస్తుందని వాళ్లు ఊహించలేకపోయారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని అంచనా వేయలేకపోయారు. మరి ఇప్పుడు తెలంగాణలోనైనా బతికి బట్ట కట్టాలని భావిస్తున్నారా అంటే అదీ కనిపించట్లేదు. హైకమాండ్‌ రేవంత్‌రెడ్డి లాంటి యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌కి పగ్గాలు అప్పగిస్తే మళ్లీ అదే సీనియర్లు అడుగడుగునా అడ్డుపడుతున్నారు.

అఫ్‌కోర్స్‌ రేవంత్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌, బీజేపీలపై విరుచుకుపడ్డట్లు సొంత పార్టీ నేతల పైనా అప్పుడప్పుడూ బ్యాలెన్స్‌ తప్పి కోప్పడుతున్నారు. ఏదిఏమైనా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తమలో తమకు ఏదైనా అసంతృప్తి, ఇగో ఫీలింగ్స్‌ ఉంటే లోపల్లోపల మాట్లాడుకోవాలి తప్ప బయటపడకూడదు. మీడియాకి ఎక్క కూడదు. అలా చేయటం వల్ల పార్టీ పరువు పోతోంది. అయినా పర్లేదు అనుకోవటానికి ఇప్పుడు అవకాశంలేదు. ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలతోపాటు కమలదళం కూడా బలపడుతోందని మర్చిపోకూడదు.

ప్రజలకు టీఆర్‌ఎస్‌ మీద బోర్‌ కొడితే తమకే ఓటు వేస్తారని కాంగ్రెస్‌ పార్టీవాళ్లు అనుకోవటానికి ఛాన్స్‌ లేదు. కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు(ముఖ్యంగా జగ్గారెడ్డి, వీహెచ్‌, కోమటిరెడ్డి, మధు యాష్కీగౌడ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి లాంటి వాళ్లు) గ్రూపు రాజకీయాలు చేస్తే వాళ్లకే నష్టమని, కాషాయ శిబిరానికి మరింత లాభమని గ్రహించాలి. ఇప్పటికే 8 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ మళ్లీ ఓడిపోతే మరో ఐదేళ్లు వేచిచూడాలి.

ఇప్పుడు కనీసం రెండో స్థానంలోనైనా ఉన్నారు. క్రమశిక్షణతో ఏకతాటి పైకి వచ్చి టీఆర్‌ఎస్‌ని ఢీకొంటే తప్ప నిలబడలేరు. మూడో స్థానానికి దిగజారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చివరికి ఏపీలో మాదిరిగా ‘పేరుకే పార్టీ’ అనే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి బీజేపీ పట్ల బీ కేర్‌ఫుల్‌గా ఉండాలి సుమా అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Exit mobile version