ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో చరిత్ర సృష్టించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన మన ఇందూరు బిడ్డ, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. 52 కిలోల విభాగంలో థాయ్ లాండ్ కు చెందిన జిట్ పాంగ్ పై 5-0తో సంచలనం విజయం సాధించిన నిఖత్ జరీన్ భారత బాక్సింగ్ లో సరికొత్త శిఖరాన్ని అధిరోహించిందని ఆయన అన్నారు.
నిఖత్ బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణమని, ఆమె కృషి, పట్టుదలే ఈ విజయానికి కారణమని ఆయన ప్రశంసించారు. ఆమె విజయం మరెంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని, మోదీ ప్రభుత్వం వచ్చాక భారత్ అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోందన్నారు బండి. ఇటీవల బ్యాడ్మింటన్ లో థామస్ కప్ గెలవడం, ఇప్పుడు నిఖత్ బాక్సింగ్ లో ఛాంపియన్ గా నిలవడం భారత క్రీడలకు మంచి రోజులుగా చెప్పుకోవచ్చన్న బండి సంజయ్.. భారత క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించి, అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్నారు.