జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ గ్రామానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెళ్లారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న బద్ధం నిహారిక కుటుంబ సభ్యులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఉక్రెయిన్ లో ఉన్న బద్దం నిహారిక తో వీడియో కాల్ లో మాట్లాడి అక్కడి పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. రష్యా దాడులతో నిన్న రాత్రి నుండి భయం భయంగా గడుపుతున్నామని నిహారిక వాపోయారు. తాను ఉన్న దగ్గర పరిస్థితి కొంత వరకు ఫరవాలేదని, మిగిలిన చోట్ల పరిస్థితి భయానకంగా ఉందని బండి సంజయ్ కు వివరించింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులెవరూ టెన్షన్ పడొద్దని బండి సంజయ్ సముదాయించారు. అక్కడున్న అందరినీ సురక్షితంగా భారత్ తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు వారందరికీ ఈ విషయాన్ని తెలిపి మనో ధైర్యం నింపాలని నిహారికకు సూచించారు. నిహారిక చదువుకుంటున్న వర్సిటీలో తెలుగు వాళ్ళందరి ఫోన్ నంబర్లు పంపితే అందరితో మాట్లాడి భారత్ తీసుకొచ్చేందుకు విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతామని భరోసా ఇచ్చారు. అక్కడున్న నిహారిక ఫ్రెండ్స్ భవానీ, సాయి జయంత్, గుడియా లతోనూ బండి సంజయ్ మాట్లాడారు. తమకు చాలా భయమేస్తోందని ఏడుస్తున్న వారితో “ఆందోళన పడొద్దు. మిమ్ముల్ని ఇండియా కు స్పెషల్ ఫ్లయిట్ లో తీసుకొచ్చేందుకు మోదీ గారు చర్యలు తీసుకుంటున్నారు. ” అని ధైర్యం నింపారు.