Bandi Sanjay Sensational Comments On TRS and Asaduddin Owaisi: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కీలుబొమ్మలని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని తాను డిమాండ్ చేస్తూనే ఉన్నానన్నారు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన తర్వాత, కేసీఆర్‌తో పాటు అందరిలోనూ చలనం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ లేని సరికొత్త రాగాన్ని కేసీఆర్ ఇప్పుడెందుకు అందుకున్నారని ప్రశ్నించారు. దారుసలాం నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే కేసీఆర్ పాటిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 17వ తేదీన టిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, వామపక్షాలు ఏం చేసినా సరే.. అది బీజేపీ విజయం అవుతుందని అన్నారు. ఒవైసీ ఎలా చెప్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు అలా ఆడుతున్నాయని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదని.. ఆయనతో భారత్ మాతకి జై, వందేమాతరం, అమర వీరులకు జోహార్లు, జై తెలంగాణ అని చెప్పించండి చూద్దామని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కాగా.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత తెలంగాణకు నిజాం పాలన నుంచి స్వేచ్ఛ లభించి 75 సంవత్సరాలు పూర్తవ్వడంతో, సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ వరకు.. అంటే సంవత్సరం కాలం పాటు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు.. సెప్టెంబర్ 17వ తేదీన పాతబస్తీలో తిరంగా యాత్ర చేపట్టేందుకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబరు 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు అని.. ఆ రోజుని తెలంగాణ విమోచన దినోత్సవంగా కాకుండా జాతీయ సమగ్రత దినోత్సవంగా జరిపించాలని కోరారు. నాడు తెలంగాణ విమోచన కోసం హిందువులతో పాటు ముస్లిములు కూడా పోరాడారని, తురేభాజ్ ఖాన్ వీరోచిత పోరాటం చేశామని గుర్తు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపు తర్వాతే సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా జరపాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 16, 17, 18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది.